టీడీపీకి షాక్.. జగన్ సమక్షంలో వైసీపీలోకి బుద్ధా..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో నేతలు జంపింగ్‌లు చేస్తున్నారు. ఏ పార్టీ అయితే తమను గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందో అక్కడికెళ్లి వాలిపోతున్నారు. అధికార, ప్రతిపక్షపార్టీల ఆపరేషన్ ఆకర్ష్ తేరలేపి మరీ నేతలకు కండువా కప్పి ఆహ్వానాలు పలుకుతున్నారు. మరీ ముఖ్యంగా పార్టీల్లో కీలకంగా ఉండే నేతల కుటుంబీకులకు గాలం వేసి మరీ లాక్కుంటున్నారు. టీడీపీ- వైసీపీలు నేతలను పార్టీల్లో చేర్చుకుంటుంటే.. మా పార్టీ ఏం తక్కువ కాదన్నట్లుగా జనసేన సైతం అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని అసంతృప్తులకు కండువా కప్పేసి సాదరంగా ఆహ్వానించేస్తోంది.
తాజాగా.. టీడీపీ కీలక నేత, ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న సోదరుడు బుద్ధా నాగేశ్వరరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ కండువా కప్పుకున్నారు. మంగళవారం నాడు ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బుద్ధా కలిశారు. ఈ సందర్భంగా జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. బుద్ధా నాగేశ్వరరావుతో పలువురు ద్వితియ శ్రేణి నాయకులు కూడా వైసీపీలో చేరారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్‌తోనే బీసీలకు న్యాయం జరుగుతుందని తాము నమ్ముతున్నామన్నారు. అంతటితో ఆగని ఆయన బుద్ధా వెంకన్నపై సైతం విమర్శల వర్షం కురిపించారు. ఇప్పటి వరకూ ఎన్నడూ వెంకన్న బీసీల కోసం పోరాడిన దాఖలాల్లేవన్నారు. త్వరలోనే మరికొంత మంది బీసీ నేతలు వైసీపీలో చేరతారని నాగేశ్వరరావు జోస్యం చెప్పారు. జగన్ అధికారంలోకి వస్తే బీసీలకు న్యాయం చేస్తారన్న నమ్మకం తమకుందన్నారు.
కాగా.. బుద్ధా వెంకన్న టీడీపీ తరఫున గట్టి స్వరం ఉన్న నేత. ప్రతిపక్ష పార్టీల నేతలపై విమర్శలు ఎక్కుపెట్టడంలో ఈయన ఎప్పుడూ ముందు ఉంటారు. ఇన్ని రోజులూ కలిసే ఉన్న వెంకన్న- నాగేశ్వరరావులకు ఎక్కడ చెడిందో కానీ ఆయన తిన్నగా తెలుగుదేశానికి గుడ్ బై చెప్పేశారు. కాగా ఆయన చేరికతో అటు టీడీపీకి.. ఇటు బుద్ధా వెంకన్నకు ఒకింత షాక్ తగిలినట్లైంది.
అయితే సొంతింటి మనిషినే పార్టీ మారకుండా నిలుపుకోలేకపోయిన బుద్ధా వెంకన్న.. అధిష్టానం అడిగితే ఏమని సమాధానం చెబుతారో వేచి చూడాలి. అయితే మరికొందరు బీసీ నేతలు వైసీపీలోకి వస్తారని నాగేశ్వరరావు బాంబు పేల్చడంతో అసలు ఆ నేతలెవ్వరు..? అనే విషయం తెలుసుకుని వారిని నిలువరించే పనిలో తెలుగు తమ్ముళ్లు నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments