చంద్రబాబుపై బుద్దా విమర్శలు.. విజయసాయిపై పొగడ్తలు!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా గురువారం నాడు నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీ పరిస్థితేంటి..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ నలుగురు ఎంపీలు టీడీపీకి టాటా చెప్పడంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కొందరు ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు వల్లే అని లోలోపల విమర్శిస్తుండగా.. మరికొందరు మాత్రం బహిరంగంగానే నోరుజారుతున్నారు. ఇప్పటికే ఈ ఎంపీల పార్టీ మార్పు వ్యవహారంపై విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు రియాక్ట్ అయిన విషయం విదితమే.
అయితే.. తాజాగా టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా పేరుగాంచిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న రియాక్ట్ అయ్యారు. అయితే ఈయన సొంత పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఒకింత విమర్శలు గుప్పిస్తూ.. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించి.. ఆయన్ను ఆకాశానికెత్తేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన బుద్ధా ఈ వ్యాఖ్యలు చేశారు. బుద్దా వ్యాఖ్యలు ప్రస్తుతం టీడీపీలో చర్చనీయాంశమయ్యాయి.
అంత అవసరం ఏమొచ్చింది!
"బీజేపీలో చేరిన నలుగురు ఎంపీల్లో టీజీ వెంకటేష్ మినహా.. మిగిలిన ముగ్గురు కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని దద్దమ్మలు. చంద్రబాబు నమ్మి వారిని రాజ్యసభకు పంపితే ఆయన గొంతు కోశారు. ఓ పార్టీ కోసం పనిచేస్తే ఆ పార్టీ విధానాలకు కట్టుబడి ఉండాలి. టీడీపీలో ఈ పరిస్థితికి రావడానికి చంద్రబాబు తీరు కూడా కారణమే. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది..? అదే చంద్రబాబు చేసిన తప్పు" అని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు.
విజయసాయిరెడ్డి బెటర్!
అంతటితో ఆగని ఆయన విజయసాయిరెడ్డిని పొగడ్తల్లో ముంచెత్తారు. టీడీపీని వీడి బీజేపీలో చేరిన ఆ నలుగురు ఎంపీల కంటే విజయసాయిరెడ్డి చాలా నయం అని అన్నారు. విజయసాయిరెడ్డికి ఓ కమిట్ మెంట్ అనేది ఉందని.. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ వల్ల జైలుకు వెళ్లాల్సి వచ్చినా కూడా విజయసాయిరెడ్డి ఆయన వెంటే ఉన్నారని చెప్పుకొచ్చారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా జగన్ వెంటే నిలబడ్డారని.. నాయకుడంటే అలా ఉండాలని ఆయన్ను చూసి టీడీపీ నేతలు నేర్చుకోవాలని ఒకింత పరోక్షంగా బుద్దా సూచించారు. పార్టీ ఓడిపోగానే వేరే కండువా కప్పుకోవడం నీచమని బుద్ధా వ్యాఖ్యానించారు. అయితే బుద్దా వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, వైసీపీ నేతలు ముఖ్యంగా విజయసాయిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments