KTR:కేసీఆర్‌తో పెట్టుకున్న వారెవరూ బాగుపడలేదు.. జేపీ నడ్డాకు కేటీఆర్ స్టైల్ వార్నింగ్
- IndiaGlitz, [Tuesday,June 27 2023]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పెట్టుకున్న ఏ ఒక్కరూ బాగుపడలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. సోమవారం హైదరాబాద్ ఉప్పల్‌లో ఏర్పాటు చేసిన స్కైవాక్ టవర్‌ను మంత్రి ప్రారంభించి ప్రసంగించారు. నాగర్ కర్నూల్‌లో జరిగిన సభలో కేసీఆర్‌ను జైల్లో పెడతామని జేపీ నడ్డా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తున్నందుకా కేసీఆర్‌ను జైల్లో పెట్టేది అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలను కరెంట్ కష్టాలు వేధించాయని.. తెలంగాణ వచ్చాక 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. మండు వేసవిలోనూ నీటి కొరత లేకుండా సీఎం పరిష్కరించారని.. నారపల్లి నుంచి ఉప్పల్ వరకు రహదారి నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని మంత్రి పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణం ఆలస్యం కావడానికి కేంద్రమే కారణమని కేటీఆర్ మండిపడ్డారు.
రేవంత్ మాటల పులి శాకాహారం కోరినట్లుగా వున్నాయి :
ఇదే సమావేశంలో కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. ప్రత్యేక ఉద్యమంలో ఎంతమంది ఉద్యమకారులు చనిపోతే.. ఆ పార్టీ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఈ మరణాలకు సోనియా గాంధీ కారణం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. అవినీతి గురించి రేవంత్ మాట్లాడుతుంటే.. పులి శాకాహారం గురించి మాట్లాడినట్లుగా, హంతకుడు సంతాపం తెలిపినట్లుగా వుందని కేటీఆర్ సెటైర్లు వేశారు. గడిచిన 9 ఏళ్లలో ఒక్కో పనిచేసుకుంటూ రాష్ట్రాన్ని , రాజధానిని అభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్న నడ్డా :
ఇక.. నిన్న నాగర్ కర్నూల్‌లో జరిగిన బీజేపీ నవసంకల్ప సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ కట్టుబడి వున్నారని.. ఇప్పటికే వేల కోట్ల నిధులను విడుదల చేశారని జేపీ నడ్డా పేర్కొన్నారు.