BRS Party: మళ్లీ టీఆర్ఎస్‌గా మారనున్న బీఆర్ఎస్.. పార్టీ ఉనికి కోసమేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీఆర్ఎస్ పార్టీ అందుకు తగ్గ కారణాలపై అన్వేషిస్తోంది. దీంతో త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఆ తప్పిదాలు జరగకుండా ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ సమీక్షల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై లోతుగా చర్చిస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు సీనియర్ నేతలు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చడమే ప్రధాన కారణమని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో పార్టీలోని తెలంగాణ పేరును తీసేసి భారత్ అనే పేరు పెట్టడం పెద్ద తప్పిదమని పేర్కొంటున్నారు.
కడియం శ్రీహరి ప్రతిపాదన..
పేరులో తెలంగాణ పదం లేకపోవడంతో ప్రజల్లోకి బలంగా వెళ్లేకపోయామని అభిప్రాయపడుతున్నారు. అసలు పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందంటే అది తెలంగాణ సెంటిమెంట్ వలనే అని వివరిస్తున్నారు. అలాంటిది పార్టీకి ఆయువుపట్టు లాంటి తెలంగాణ పదాన్ని తీసివేసి భారత్ అనే పేరుతో ఎన్నికల్లోకి వెళ్లడం దెబ్బ కొంటిందని చెప్పుకొస్తున్నారు. అందుకే మళ్లీ పార్టీలో తెలంగాణ పదం చేర్చి టీఆర్ఎస్‌గా మార్చాలని కోరుతున్నారు. పార్టీ సీనియర్ నేత, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ ప్రతిపాదనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలోనే తీసుకొచ్చారు. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
దీని వెనక కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం..?
అయితే ఈ ప్రతిపాదన వెనక మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఎందుకంటే పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కేసీఆర్‌ను కాదనే సాహసం ఎవరూ చేయరు. అందుకే ఇలా కీలకమైన నేతల చేత పార్టీ పేరును మార్చాలనే ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తున్నారంటున్నారు. జాతీయ రాజకీయాల్లో పాగా వేయాలనే ఉత్సాహంతో తన పార్టీని బీఆర్ఎస్‌గా మార్చారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరారు. 50కి పైగా ఎంపీ సీట్లు గెలిచి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ప్రయత్నించారు.
తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేలా..
అయితే ఇటీవల సొంత రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమి ఎదురు అవ్వడంతో బొక్కబోర్లా పడ్డారు. దీంతో జాతీయ రాజకీయాలు వదిలేసి ముందు సొంత రాష్ట్రంలో పార్టీని నిలబెట్టుకోవాలని ఆలోచనకు వచ్చారు. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన స్థానాలు లభించకపోతే పార్టీ ఉనికికే ప్రమాదం వస్తుంది. నేతలు మెల్లగా ఇతర పార్టీల్లోకి జారుకుంటారు. అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా రాష్ట్రంలో పరిస్థితి మారిపోతుంది. అందుకే పార్టీకి ప్రత్యేక గుర్తింపు లాంటి తెలంగాణ పేరును మళ్లీ పేరులో చేర్చాలనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీనియర్ నేతల చేత ఇలాంటి లీకులు ఇప్పిస్తున్నారని వాదనలు వినపడుతున్నాయి. మరి మరో రెండు నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల లోపు పార్టీ పేరులో తెలంగాణ పదం చేర్చడం సాధ్యమవుతుందో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments