MLC Kalvkuntla Kavitha:ఢిల్లీ లిక్కర్ స్కాం : ముగిసిన కల్వకుంట్ల కవిత విచారణ.. రేపు మరోసారి రమ్మన్న ఈడీ
- IndiaGlitz, [Tuesday,March 21 2023]
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయానికి వెళ్లిన కవితను అధికారులు దాదాపు 10 గంటల పాటు విచారించారు. ప్రధానంగా పీఎంఎల్ఏ సెక్షన్ 10 కింద ప్రశ్నలు సంధించారు. అనంతరం రాత్రి 9 గంటలకు కవిత విచారణ ముగించారు. అయితే మంగళవారం ఉదయం 11 గంటలకు మరోసారి విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
మార్చి 11న విచారణకు హాజరైన కవిత :
కాగా.. ఈ కేసుకు సంబంధించి మార్చి 11న కవిత ఈడీ ఎదుట హాజరయ్యారు. ఆరోజున దాదాపు 9 గంటల పాటు కవితను విచారించింది ఈడీ. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను రాబట్టంతో పాటు ఆమె వ్యక్తిగత సెల్‌ఫోన్స్‌ను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మార్చి 16న మరోసారి తమ ఎదుట హాజరవ్వాల్సిందిగా ఈడీ నోటీసులు ఇచ్చింది. దీంతో అదే రోజు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులతో కలిసి కవిత హైదరాబాద్‌కు చేరుకుని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహిళనైన తనను కార్యాలయానికి పిలిపించడం, రాత్రి 9 గంటల వరకు కూర్చోబెట్టడంతో పాటు బెదిరింపులు, బలప్రయోగం, థర్డ్ డిగ్రీ విధానాలను ఈడీ అవలంభిస్తోందని దీనిని అడ్డుకునేలా ఆదేశాలివ్వాలని కవిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై మార్చి 24న సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపనుంది.
సుప్రీంకోర్టులో ఈడీ కేవియెట్ :
మార్చి 16న విచారణకు హాజరవుతానని చెప్పి ఈడీకి షాకిచ్చారు కవిత. తన ప్రతినిధి మాత్రం ఈడీ ఆఫీస్‌కు పంపి, సుప్రీంకోర్టులో కేసు విచారణలో వున్నందున తాను హాజరుకాలేనని ఈడీకి లేఖ రాశారు కవిత. దీనిపై స్పందించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఈ నెల 20 తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో ఈడీ సైతం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తమ వాదనలు వినకుండా కవిత విషయంలో ఎలాంటి ముందస్తు ఆదేశాలు జారీ చేయొద్దని సుప్రీంకోర్టును కోరుతూ కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది.