Kalvakuntla Kavitha:ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఈడీ విచారణకు హాజరైన కల్వకుంట్ల కవిత, ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయం వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు
Send us your feedback to audioarticles@vaarta.com
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఆమెతో పాటు భర్త అనిల్ కుమార్, న్యాయవాదులు వున్నారు. రెండ్రోజుల క్రితమే ఢిల్లీకి వచ్చిన కవిత.. శుక్రవారం మహిళా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలంటూ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. దీక్ష ముగిసిన వెంటనే బీఆర్ఎస్ లీగల్ ప్రతినిధులతో ఆమె భేటీ అయ్యారు. అనంతరం శనివారం తుగ్లక్ రోడ్‌లోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి భర్తతో కలిసి చేరుకున్నారు కవిత. ఆమెకు మద్ధతుగా బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
రిమాండ్ రిపోర్టులలో పలుమార్లు కవిత పేరు :
ఇదిలావుండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో సీబీఐ అధికారులు సైతం ఆమెను విచారించారు. ఆ తర్వాత విషయం సద్దుమణగగా..మళ్లీ అనూహ్యంగా మనీష్ సిసోడియా, రామచంద్రపిళ్లైల అరెస్ట్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ కవితేనంటూ ప్రచారం జరిగింది. బీజేపీ నేతలు సైతం ఈ విషయాన్ని పదే పదే చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంతో రాజకీయాలు వేడెక్కాయి. అటు కస్టడీలో వున్న రామచంద్రపిళ్లై సైతం తాను కవిత బినామీనేనని వాంగ్మూలం ఇవ్వడం.. ఆ తర్వాత తన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటానంటూ పిటిషన్ వేయడం వంటి వ్యవహారాలతో శుక్రవారం హైడ్రామా నడిచింది.
అరెస్ట్ చేస్తే భయపడేది లేదన్న కేసీఆర్ :
మరోవైపు.. కవితకు ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పందించారు. కవితను అరెస్ట్ చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరని నేతలను వేధిస్తున్నారని, కవితను కూడా పార్టీలో చేరమన్నారని.. ఆమె నిరాకరించడంతోనే కేసులతో వేధిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. అరెస్ట్ చేసినా పర్లేదని.. భయపడేది లేదని, పోరాటం కొనసాగిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించి దేశం నుంచి పారద్రోలుదామని కేసీఆర్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com