BRS MLAs: మధురై కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రీజన్ ఇదే..

  • IndiaGlitz, [Wednesday,January 10 2024]

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి తమిళనాడులోని మధురై కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం వీరు కోర్టులో కూర్చుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా మాణిక్కం ఠాగూర్ ఉన్న సమయంలో టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. అయితే రేవంత్ నియామకం కోసం మాణిక్కం ఠాగూర్ రూ.500కోట్లు తీసుకున్నారని కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన ఆయన.. మధురై కోర్టులో వారిపై పరువునష్టం దావా దాఖలు చేశారు. దీనిపై విచారణకు హాజరు కావాలని కోర్టు చాలా సార్లు సమన్లు జారీ చేయగా.. వారు హాజరుకాలేదు. దీంతో వారిద్దరికి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. దీంతో ఇరువురు న్యాయమూర్తి ముందు హాజరైనట్లు తెలుస్తోంది. అనంతరం నాన్‌బెయిల్‌బుల్ వారెంట్‌ను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తాజాగా దీనిపై ఠాగూర్ సోషల్ మీడియాలో స్పందిస్తూ మాపై వచ్చిన ప్రతి ఆరోపణపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వారు నాపై చేసిన తప్పుడు ఆరోపణలపై స్పందిస్తూ మధురై కోర్టులో పరువు నష్టం కేసు వేశాను. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి ఇద్దరూ మదురై కోర్టుకు హాజరుకాగా.. న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది” అంటూ తెలిపారు.

అయితే ఠాగూర్ ట్వీట్‌పై కౌశిక్ రెడ్డి కౌంటర్ ట్వీట్ చేశారు. మాణిక్కం ఠాగూర్ జీ.. ఈ ఆరోపణలు సొం స్వంత కాంగ్రెస్ పార్టీ నేతలు చేసారు.. మేము దానిని సమర్థించాము.. అయితే న్యాయం గెలుస్తుందని చింతించకండి. ఇది సమయం మాత్రమే అంటూ పేర్కొన్నారు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.