సీఎం రేవంత్ రెడ్డితో భేటీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్లారిటీ
Send us your feedback to audioarticles@vaarta.com
పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. ప్రజాసమస్యలపై చర్చించేందుకే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు స్పష్టంచేశారు. అంతే తప్ప పార్టీ మారే ఉద్దేశం తమకు లేదన్నారు. తమ నాయకుడు ఎప్పటికీ కేసీఆర్‌నే అని క్లారిటీ ఇచ్చారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధికి సహకరించాలని సీఎంను కోరామన్నారు.
అందుకే సీఎంను కలిశాం..
స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్, ప్రొటోకాల్ ఉల్లంఘన, గన్మెన్ల కుదింపు తదితర అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రిని కలిశామని తెలిపారు. ఎస్డీఎఫ్ నిధులు అర్ధాంతరంగా ఆపేయడం వల్ల అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు. అధికారులు ప్రొటోకాల్ పాటించకుండా తమను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇందులో రాజకీయ దురుద్దేశం గానీ, పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టంచేశారు. అనవసరం తాము పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రం మొత్తానికి సీఎం..
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికే ముఖ్యమంత్రి కాదని.. రాష్ట్రం మొత్తానికి సీఎం అని గుర్తు చేశారు. శాసనసభ్యులుగా తమ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు అయినా ముఖ్యమంత్రిని కలుస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ కలిశారని..అలాగే అదేవిధంగా తాము కూడా నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రిని కలిశామని పేర్కొన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎక్కడికైనా పోతాం ఎవరినైనా కలుస్తామని వెల్లడించారు. అంత మాత్రాన పార్టీ మారుతున్నట్లు ఎలా అనుకుంటారని నిలదీశారు.
పరువునష్టం దావా వేస్తాం..
ప్రజల సమస్యల పరిష్కారం కోసం మంత్రులను, అధికారులను కలుస్తుంటామని చెప్పారు. ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని.. కేసీఆరే తమ నాయకుడని వివరించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు. ఇక నుంచి తమపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే పరువునష్టం దావా వేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. కాగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమతో 30మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నలుగురు గులాబీలు ఎమ్మెల్యేలు రేవంత్‌ను కలవడంతో అనుమానాలకు తావిచ్చింది. తాజాగా వారు క్లారిటీ ఇవ్వడంతో పార్టీ మార్పు వార్తలకు చెక్ పడింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout