రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య హఠాన్మరణం.. రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం..
- IndiaGlitz, [Friday,February 23 2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్మే లాస్య సందిత(Lasya Nanditha)రోడ్డు ప్రమాదంలో హఠానర్మణం చెందారు. దీంతో బీఆర్ఎస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. గురువారం రాత్రి సదాశివపేటలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా.. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ సుల్తాన్ పూర్ ఓఆర్ఆర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె స్పాట్లోనే మృతి చెందగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పటాన్ చెరులోని అమేథా అసుపత్రికి తరలించారు.
ఆమె మరణవార్త తెలుసుకున్న కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. లాస్య తల్లి, సోదరిని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్ర షాక్‌లో ఉన్నారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న ఆమె.. చిన్న వయసులోనే ఇలా అకాల మరణం చెందడం అత్యంత విషాదకరమని వాపోతున్నారు. అంతేకాకుండా తండ్రి మరణించిన సరిగ్గా ఏడాది తర్వాత కూతురు కూడా మరణించడాన్ని జీర్ణించులేకపోతున్నారు. కాగా గతేడాది ఫిబ్రవరి 19 దివంగత ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యంతో కన్నుమూశారు. ఇప్పుడు ఏడాది తర్వాత లాస్య మరణించడం అందరిని తీవ్రంగా కలిచివేస్తుంది.
అయితే ఇటీవల జరిగిన పరిస్థితులు చూస్తే లాస్య నందితను మృత్యువు వెంటాడుతున్నట్లు ఉంది. నెల రోజుల క్రింత ఆమె ఓ లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడం.. అలాగే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఛలో నల్లగొండ సభకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి అయింది. అయితే ఈ రెండు ప్రమాదాల నుంచి ఆమె తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కానీ తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మాత్రం ప్రాణాలతో బయటపడలేకపోయారు. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం తండ్రి చనిపోవడం.. కూతురును వరుస ప్రమాదాలు వెంటాడి ఆమె కూడా చనిపోవడం కంటతడి పెట్టిస్తోంది.
డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో సడన్ బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పి రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టినట్లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో లాస్య నందిత సీటు బెల్ట్ పెట్టుకోలేదని గుర్తించారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జైంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.
కాగా 2016లో కవాడిగూడ నుంచి లాస్య నందిత కార్పొరేటర్‌గా గెలిచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అనంతరం 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తండ్రి సాయన్న వెంటే ఉంటూ నియోజకవర్గం ప్రజలతో మమేకమవుతూ పట్టు సాధించారు. ఈ క్రమలోనే 2023 ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందడంతో ఆ స్థానం నుంచి గతేడాడి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందిత పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ఇలా అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోవడం రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర విషాదం నింపింది.