BRS: బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రతిపక్షాలకు చెక్ పెట్టనుందా..? కాంగ్రెస్ ఆరు గ్యారంటీ హామీలకు ధీటుగా ఉచిత హామీలు..?
- IndiaGlitz, [Thursday,October 05 2023]
తెలంగాణలో మరో నెల, రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. వ్యూహలు ప్రతివ్యూహాలు, ఎత్తులు పైఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. మిగిలిన పార్టీల కంటే ముందుగా 115 మంది అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్ రేసులో ముందుండగా.. కాంగ్రెస్, బీజేపీ తర్వలోనే అభ్యర్థులను ప్రకటించనున్నాయి. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలు తయారుచేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఆరు గ్యారంటీ హామీలను ప్రకటించింది. దీంతో వాటిని తలదన్నేలా పథకాలను ప్రకటించేందుకు గులాబీ బాస్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నారు.
మహిళలే లక్ష్యంగా కొత్త పథకాలు ప్రకటించే అవకాశం..?
ఈ క్రమంలోనే అక్టోబర్ 16వ తేదీన వరంగల్‌లో ఎన్నికల శంఖారావం సభను నిర్వహించనున్నారు. ఈ సభా వేదికగా కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించనున్నారని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యేలా మేనిఫెస్టో ఉంటుందని హింట్ కూడా ఇచ్చారు. మంచి శుభవార్త వినడానికి తెలంగాణ ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ మేనిఫెస్టోపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే అమలువుతున్న కల్యాణలక్ష్మీ, రైతు బంధు, గృహలక్ష్మీ, దళిత బంధు, ఆసరా పెన్షన్లను మరింత పెంచే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వీటితో పాటు మహిళలను మరింతగా ఆకట్టుకునేలా కొత్త పథకాలు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ హామీలకు ధీటుగా మేనిఫెస్టో ఉండనుందని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. కొంతమంది సీనియర్ నాయకుల సలహాలతో కేసీఆర్ ఆకర్షణీయమైన మేనిఫెస్టో తయారుచేస్తున్నట్లు సమాచారం.
హ్యాట్రిక్ కొట్టేందుకు మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేస్తున్న కేసీఆర్..!
ఈ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాల దూకుడుకు చెక్ పడనుందని బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వచ్చేందుకు ప్రజలను ఆకట్టుకునేలా సూపర్ ప్లానులు రెడీ చేస్తు్న్నారని భావిస్తు్న్నారు. ఆరు గ్యారంటీ హామీలు ప్రకటించి జోష్ మీదున్న కాంగ్రెస్‌కు దిమ్మతిరిగేలా మేనిఫెస్టో ఉండనుందని చెబుతున్నారు. మొత్తానికి ఆకర్షణీయమైన పథకాలు ప్రకటించి ప్రజలను ఆకట్టుకోవడంలో ఆరితేరిన గులాబీ బాస్ కేసీఆర్.. ఈసారి కూడా మరిన్ని జనరంజకమైన పథకాలు ప్రకటించనున్నారని తెలంగాణ భవన్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి ఈసారి తెలంగాణ ఎన్నికలు పథకాల చుట్టూనే తిరగనున్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.