RS Praveen Kumar: తెలంగాణ గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడు పెత్తనం ఏంది బై: ఆర్‌ఎస్పీ
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న రాష్ట్ర గీతం 'జయజయహే తెలంగాణ' చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని ఈ గీతానికి సంగీతం అందించాలని ప్రభుత్వం కోరడంపై బీఆర్‌ఎస్ నేతలు తప్పుబడుతున్నారు. తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ రేవంత్ సర్కారుపై విరుచుకుపడ్డారు. కీరవాణి సంగీతం సమకూర్చడానికి ఇది నాటు నాటు పాట కాదని... తెలంగాణ రణ నినాదమని గర్జించారు.
"అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతంపై 'ఆంధ్రా' సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి పెత్తనం ఏంది భై ? గీత స్వరకల్పనకు మళ్లీ ఇప్పుడేం అవసరమొచ్చింది? అయినా తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంత కాలం? అదీ తెలంగాణ వచ్చి పదేళ్లయినంక? అంటూ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
"ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ... కీరవాణి స్వరకల్పన చేయడానికి ఇదీ "నాటు నాటు" పాట కాదు. నాటి ఆంధ్ర పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన వందల మంది అమరుల త్యాగాలు, 4 కోట్ల ప్రజల కలల ప్రతి రూపం. ఒక రణ నినాదం. ధిక్కార స్వరం. అందెశ్రీ ఇచ్చిన ఒరిజినల్ ట్యూన్‌తోనే ఈ గీతాన్ని యావత్తు తెలంగాణ ఆనాడు ఆలాపించింది. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 3, 2011 విద్యార్థి గర్జనలో లక్షల మంది ప్రజలు ఈ గీతాన్ని సామూహికంగా ఆలాపించిన తీరు చూసుంటే మీరు ఈ దుస్సాహసం చేయరు. మీరప్పుడు అక్కడ ఉండే అవకాశం లేదు కాబట్టి బహుశా మీకిది తెల్వదు. నేనారోజు అక్కడ ఉన్న కాబట్టి చెబుతున్నా" అని తెలిపారు.
"టాలీవుడ్, తెలంగాణ ఉద్యమం వేరువేరు. టాలీవుడ్ వినోదం కోసం ఉంది. తెలంగాణ గీతం అనేది ఉద్యమ సమయంలో తెలంగాణ నినాదాన్ని ఒకచోట చేర్చిన భావోద్వేగం. జనగణమన, వందేమాతరం చిత్రాలకు ట్యూన్ ఇచ్చింది హాలీవుడ్ కాదు. పాపం అందెశ్రీ అమాయకుడు, నిస్సహాయుడు కాబట్టి మౌనంగా కూర్చున్నడు. మీరేం చేసినా భరిస్తున్నడు." "మీరు ఆంధ్ర సంగీత కళాకారులకు అంత ముచ్చటపడితే దయచేసి ఏపీకి వెళ్లి అక్కడ సీఎం అవ్వండి. తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చుంటే తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించి తెలంగాణ ప్రతిభను ప్రోత్సహించాలి సార్. ప్రజాప్రతినిధులు, ఆంధ్రా ఏజెంట్ల పాలన మనకు చాలు. ఇలాంటి దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో తరాలు పోరాడి ప్రాణాలు కోల్పోయాయి." అన్నారు.
తెలంగాణ ప్రజలారా, జూన్ 2 నాడు ఆంధ్ర సంగీతకారులు స్వరకల్పన చేసిన మన తెలంగాణ గీతాన్ని పాడుకుందమా, లేక మన ఒరిజినల్ గీతాన్నే పాడుకుందమా?? అని పిలుపునిచ్చారు ప్రవీణ్‌కుమార్. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో మరోసారి అగ్గి రాజుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments