BRS, BSP:తెలంగాణలో పొడిచిన కొత్త పొత్తు.. కలిసి పోటీచేయనున్న బీఆర్ఎస్, బీఎస్పీ..
Send us your feedback to audioarticles@vaarta.com
పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో కొత్త పొత్తు పొడిచింది. ఎవరూ ఊహించని విధంగా బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చల అనంతరం పొత్తుకు అంగీకారం తెలిపారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ బీఎస్పీతో గౌరవప్రదమైన పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. బీఎస్పీ హైకమాండ్‌తో మాట్లాడి అనుమతి తీసుకున్నారని.. ఆ తర్వాత బీఆర్ఎస్, బీఎస్పీ కలిపి పని చేయాలని నిర్ణయించామని తెలిపారు.
సీట్ల సర్దుబాటు, పొత్తు విధివిధానాలతో పాటు మిగతా విషయాలన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. కొన్ని సీట్లలో వారు, తాము కొన్ని సీట్లలో పోటీ చేస్తామని చెప్పారు. నాగర్‌కర్నూల్ నుంచి ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారా..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. పెద్దపల్లి నుంచి పోటీ చేయొద్దా..? రాష్ట్ర అధ్యక్షుడు కదా.. వరంగల్ నుంచి కూడా పోటీ చేయొచ్చు. జనరల్ సీట్లలో కూడా పోటీ చేయొచ్చు అని కేసీఆర్ తెలిపారు.
ఇక ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీతో తెలంగాణకు ముప్పు ఏర్పడిందని విమర్శించారు. రాజ్యాంగానికి ఈ రెండు పార్టీలు తూట్లు పొడుస్తున్నాయన్నారు. ఈ రెండు పార్టీల నుంచి తెలంగాణను కాపాడుకోవడానికే పొత్తులు పెట్టుకున్నామని.. అన్ని విషయాలు త్వరలోనే తెలియ చేస్తామన్నారు. తమ స్నేహం తెలంగాణను పూర్తిగా మారుస్తుందని ఆర్ఎస్పీ ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలు అవుతోందని.. ఈ ప్రభుత్వం పట్ల నిరుద్యోగులు సంతోషంగా లేరని విమర్శలు చేశారు. నిరుద్యోగులు రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి ఉందన్నారు. తమను తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది అని పేర్కొన్నారు.
కాగా పొత్తులకు దూరంగా ఉండే కేసీఆర్.. ఈసారి మాత్రం కీలకమైన పార్లమెంట్ ఎన్నికల వేళ పొత్తు పెట్టుకోవడం ఆశ్చర్యంగా ఉంది. గతంలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు. అనంతరం వారిని పక్కనపెట్టేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వారితో పొత్తు పెట్టుకుంటారని అనుకున్నా చివరకు ఒంటరిగానే బరిలో దిగారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్, బీజేపీల్లోకి వలసలు పెరిగాయి. ఏకంగా సిట్టింగ్ ఎంపీలే పార్టీ మారడం గమనార్హం. దీంతో బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే వలసలు కొన్ని సీట్లలో ఆ పార్టీ ఓట్లు కలిసి వస్తాయనే ప్లాన్‌తోనే పొత్తు పెట్టుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఐపీఎస్ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా నెగ్గలేదు. దీంతో ఆర్ఎస్పీ రాజకీయ భవిష్యత్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పొత్తు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నాగర్ కర్నూలు లేదా వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవాలనే నిర్ణయంతోనే బీఆర్ఎస్తో పొత్తుకు అంగీకారం తెలిపినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments