విరిగిపడిన కొండ చరియలు.. ఐదారుగురున్నట్టు అనుమానం..

  • IndiaGlitz, [Wednesday,October 21 2020]

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. రాళ్ల కింద ఐదారుగురు శానిటేషన్‌ సిబ్బంది ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంద్ర కీలాద్రిపై మౌనస్వామి కొండ కొన్నేళ్లుగా బీటలు వారుతోంది. భారీ వర్షాలకు 4 అంగుళాల మేర కొండ బీటలు వారింది. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. హెచ్చరిక బోర్డులు పెట్టి అధికారులు వదిలేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రస్తుతం విరిగిపడిన కొండ చరియల కింద ఐదారుగురు ఉన్నారని అధికారులు భావిస్తుండటంతో.. సిబ్బందిలో భయాందోళనలు వ్యక్తమవుతున్నారు.

కాసేపట్లో ఇంద్రకీలాద్రికి సీఎం జగన్..

ఇవాళ మూల నక్షత్రం కారణంగా ముఖ్యమంత్రి జగన్ అమ్మవారికి పట్టు చీర సమర్పించేందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. మరోవైపు సీఎం జగన్‌ వస్తున్న సమయంలో ఎలాంటి అపరిశుభ్రత కనిపించకుండా సిబ్బందితో శుభ్రం చేయించారు. మరికాసేపట్లో ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు పట్టుచీర సమర్పించేందుకు జగన్ రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలా జరగడం పట్ల అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ఇటీవల కూడా ఇంద్రకీలాద్రిలో బండరాళ్లు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకుని బండరాళ్లను తొలగింపు చర్యలు చేపట్టాయి. ఈ కారణంగా ఘాట్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను అధికారులు నిలిపివేశారు. దేవీ శరన్నవరాత్రులు ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతుంటాయి. అమ్మవారి దర్శనార్థం భక్తులు విశేషంగా వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బండరాళ్లు తరచూ విరిగిపడుతుంటడం భయాందోళనకు గురిచేస్తోంది.