కుప్పకూలిన ‘థామస్‌కుక్’.. నో చెప్పిన బ్రిటన్ సర్కార్!
Send us your feedback to audioarticles@vaarta.com
బ్రిటిష్ పర్యాటక సంస్థ ‘థామస్‌కుక్’ ఒక్కసారిగా కుప్పకూలింది. పది, పదిహేను కాదు.. ఏకంగా 178 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీ దివాలా ప్రకటించడం పెద్ద షాకింగ్ న్యూసే. అంతేకాదు.. ఈ దివాలాతో కొన్ని వేలమంది ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అయితే చివరి నిమిషంలో జరిపిన చర్చలు విఫలం కావడంతో చేసేదేమీ లేక థామస్‌కుక్ దివాలా తీసింది. దీంతో.. ప్రపంచవ్యాప్తంగా థామస్‌కుక్ తన విమాన సేవలను నిలిపివేసినట్టుగా బ్రిటిష్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఓ ప్రకటనలో తేల్చిచెప్పింది. థామస్‌కుక్‌కు చెందిన విమాన, హాలిడే బుకింగ్స్‌లను రద్దు చేసినట్టు ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 22వేల ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోయాయి. వీరిలో 9వేల మంది బ్రిటన్ వారున్నారు. అంతేకాదు వేలాదిమంది ప్రయాణీకులు ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు.
బ్రిటన్ ప్రధాని ఏమన్నారంటే..!
వాస్తవానికి.. ఈ కంపెనీకి బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇచ్చేందుకు బ్రిటన్ సర్కార్ నో చెప్పింది. కంపెనీ నష్టాలకు డైరెక్టర్లు కారణమనే అనుమానాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొనడానికి వెళుతూ.. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘థామస్ కుక్ కంపెనీకి బెయిల్ అవుట్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. కంపెనీకి బెయిల్ అవుట్ ఇవ్వడమంటే.. నైతికతకు వచ్చిన ఆపదే. అదంతా ప్రజలు పన్నుల రూపంలో కట్టిన ధనం’ అని ఆయన చెప్పుకొచ్చారు.
కాగా.. ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి థామస్ కుక్ కంపెనీ చివరి వరకు ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. అదనపు అప్పుల కోసం చైనాకు చెందిన ఫోసన్ టూరిజం గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధమైంది. ముందుగా 900 మిలియన్ పౌండ్లకు ఒప్పందం కుదిరినా.. ఆ తర్వాత మరో 200 మిలియన్ పౌండ్లు అదనంగా ఇవ్వాలని ధామస్ కుక్ కంపెనీ కోరింది. దీనికి ఫోసన్ నో చెప్పడంతో ఒప్పందం రద్దయ్యింది. మరి ఉద్యోగుల పరిస్థితేంటి..? అనేది మాత్రం ఇంతవరకూ తెలియరాలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments