Queen Elizabeth II: క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూత.. 70 ఏళ్ల పాటు బ్రిటన్‌ను పాలించిన "మహారాజ్ఞి"
Send us your feedback to audioarticles@vaarta.com
బ్రిటన్ రాజకుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూశారు. ఆమె వయసు 96 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో క్వీన్ గురువారం రాత్రి స్కాట్లాండ్‌లోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. గతేడాది అక్టోబర్ నుంచి క్వీన్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చివరికి నడవటం, కూర్చోవడం కూడా ఇబ్బందిగానే వుంది. నాటి నుంచి స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ క్యాజిల్‌కే పరిమితమైన ఎలిజబెత్ .. అధికారిక కార్యక్రమాలకు సైతం దూరంగా వుంటున్నారు. బుధవారం మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాల్సి వున్నప్పటికీ.. డాక్టర్ల సూచన మేరకు దూరంగా వున్నారు. అయితే ఒక్కసారిగా క్వీన్ ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స తీసుకుంటున్నారు.
ఇటీవలే మహారాణిగా 70 ఏళ్ల వేడుకలు:
బ్రిటన్ రాజ కుటుంబ చరిత్రలోనే అత్యధిక కాలం రాణిగా (70 ఏళ్ల పాటు) కొనసాగిన రికార్డు ఆమెదే. ఇటీవల క్వీన్ ఎలిజబెత్ 2 .. 70 ఏళ్ల సేవలకు గాను బ్రిటన్‌లో ప్లాటినం జూబ్లీ వేడుకలను నిర్వహించారు. విన్‌స్టన్ చర్చిల్ నుంచి తాజా లిజ్ ట్రస్ వరకు 14 మంది బ్రిటన్ ప్రధాన మంత్రులను క్వీన్ చూశారు. బోరిస్ జాన్సన్ రాజీనామాతో ఖాళీ అయిన బ్రిటన్ ప్రధాని పదవికి జరిగిన ఎన్నికల్లో లిజ్ ట్రస్ గెలిచి.. ఎలిజబెత్ 2ని కలిశారు.
ఇదీ ప్రస్థానం:
1926, ఏప్రిల్ 21వ తేదీన లండన్ 17 బ్రూటన్ స్ట్రీట్‌లో కింగ్ జార్జ్ -6, క్వీన్ ఎలిజబెత్ దంపతులకు ఎలిజబెత్ 2 జన్మించారు. గ్రీస్ యువరాజు, నేవీ లెఫ్టినెంట్ ఫిలిప్ మౌంట్‌బాటెన్‌ను 1947లో పెళ్లాడారు. ఈ దంపతులకు ప్రిన్స్ ఛార్లెస్, ప్రిన్సెస్ అన్నె, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ సంతానం. 1952 ఫిబ్రవరి 6న కింగ్ జార్జ్ -6 మరణించడంతో క్వీన్ ఎలిజబెత్‌ను ఆయన వాసురాలిగా ప్రకటించారు. అయితే ఏడాది తర్వాత 1953 జూన్ 2న వెస్ట్‌మినిస్టర్‌లో బ్రిటన్ మహారాణిగా ఆమె సింహాసనం అధిష్టించారు. క్వీన్ ఎలిజబెత్ 2 మరణంతో ఆమె కుమారుడు ప్రిన్స్ ఛార్లెస్ బ్రిటన్ రాజుగా పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout