ఇండియా తనకు రెండో ఇల్లు అంటూ బ్రెట్‌లీ భారీ విరాళం
- IndiaGlitz, [Wednesday,April 28 2021]
భారత్‌లో కరోనా మహమ్మారి అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఆక్సిజన్ కొరత, పీపీఈ కిట్ల కొరత వంటి సమస్యలతో అల్లాడుతోంది. ఈ క్రమంలోనే పలు దేశాలు భారత్‌కు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ రూ.50 వేల అమెరికన్ డాలర్లు విరాళంగా ప్రకటించారు. దేశంలో కరోనాతో బాధపడుతున్న రోగులు ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సిలిండర్ల కొనుగోలు కోసం ప్యాట్ కమ్మిన్స్ విరాళాన్ని ప్రకటించారు. కాగా.. ప్యాట్ కమ్మిన్స్ నుంచి స్ఫూర్తి పొందిన ఆసిస్ మాజీ పేసర్ బ్రెట్ లీ ఇండియాకు తన వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు.
భారత్‌లోని ఆసుపత్రులకు ఆక్సిజన్ సప్లై కోసం 1 బిట్ కాయిన్ అంటే దాదాపు 42 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఇండియా ఎప్పుడూ తనకు రెండో ఇల్లు వంటిదని.. క్రికెటర్‌గా కొనసాగినన్ని రోజులు, రిటైర్మెంట్ తర్వాత కూడా భారత ప్రజలతో తనకు మంచి అనుబంధం ఉందని బ్రెట్‌లీ వెల్లడించారు. భారతదేశానికి ఎప్పుడూ తన గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. కరోనా విపత్తుతో భారతదేశ ప్రజలు ఇబ్బంది పడడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నానన్నారు. దయచేసి ప్రజలంతా కనీస జాగ్రత్తలు తీసుకోవాలని.. ఇంట్లోనే ఉండాలని... చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. మాస్క్ ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని బ్రెట్‌లీ ట్వీట్ చేశారు.
Well done @patcummins30 ???? pic.twitter.com/iCeU6933Kp
— Brett Lee (@BrettLee_58) April 27, 2021