Sharmila:కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనానికి బ్రేకులు.. షర్మిల ఒంటరి అయిపోయారా..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుల తనయగా వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైఎస్సార్‌టీపీ) పెట్టి రెండేళ్ల నుంచి ఆమె పాదయాత్ర చేస్తూ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుడ్డారు. అయితే ఇక్కడ రాణించాలంటే ఒంటరిగా పోరాడటం కష్టమని భావించిన షర్మిల.. కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేయాలని భావించారు. ఈ క్రమంలోనే తమ కుటుంబానికి సన్నిహితులైన కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌తో సంద్రదింపులు జరిపారు. అనంతరం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమై పార్టీ విలీనంపై చర్చించారు.
చక్రం తిప్పిన రేవంత్ రెడ్డి.. విలీనం ప్రక్రియకు బ్రేకులు..
అయితే షర్మిల రాకను మాత్రం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. షర్మిల పార్టీలోకి వస్తే తెలంగాణలో జరగబోయే నష్టాలను సవివరంగా అధిష్టానానికి అందజేసినట్లు తెలుస్తోంది. 2018లో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే నష్టపోయిందో.. షర్మిల పార్టీలోకి వస్తే ఈసారి కూడా అదే విధంగా నష్టపోయే అవకాశాలున్నాయని నివేదికలో పొందుపరిచారట. దీంతో షర్మిల పార్టీ విలీనాన్ని కాంగ్రెస్ హైకమాండ్ పెండింగ్‌లో పెట్టింది. ముఖ్యంగా ఆమెను తెలంగాణ కంటే ఏపీ రాజకీయాల్లో వాడుకోవాలని రాహుల్ గాంధీ భావించారు. ఏపీలో పతనమైన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ జవసత్వాలు రావాలన్నా.. జగన్‌ను ధీటుగా ఎదుర్కోవాలన్నా షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యలు ఇవ్వాలని భావించారట. అయితే ఈ ప్రతిపాదనకు షర్మిల నో చెప్పడంతో విలీనంకు బ్రేకులు పడ్డాయి.
119 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీకి సిద్ధం..
ఇటీవల ఢిల్లీ వెళ్లిన షర్మిల సెప్టెంబర్ 30లోగా ఏదో విషయం తేల్చాలని కాంగ్రెస్ అధిష్టానానికి డెడ్‌లైన్ పెట్టారు. అయినా కానీ ఇంత వరకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పందన రాలేదు. దీంతో ఆమె తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. 119 నియోజకవర్గాల్లో పోటీ కోసం ఈ నెల 9వ తేదీ నుంచి ఆశావాహుల నుంచి వైఎస్సార్‌టీపీ దరఖాస్తులు స్వీకరించాలని డిసైడ్ అయ్యారు. దీంతో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనలో వైఎస్సార్‌టీపీ వర్గాలు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
తుమ్మలతో షర్మిలకు చెక్ పెట్టిన రేవంత్ రెడ్డి..
కాంగ్రెస్‌లోకి షర్మిల రాకను తొలి నుంచి రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఆమె చేరితే లాభం కంటే నష్టమే ఎక్కువ అని డీకే శివకుమార్‌తో పాటు కాంగ్రెస్ పెద్దలకు వివరించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయడానికి షర్మిల ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పార్టీ ఆఫీసుతో పాటు వైఎస్సార్ విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆమెను సికింద్రాబ్ అసెంబ్లీ నుంచి పోటీ చేయించాలని అధిష్టానం భావించింది.. కానీ షర్మిల ఇందుకు ఒప్పుకోలేదు. ఈలోపు వ్యూహాత్మకంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. దీంతో ఆయనకు పాలేరు నుంచి టికెట్ ఖరారు చేసినట్లు సమాచారం. తుమ్మల హస్తం తీర్థం పుచ్చుకోవడంతో షర్మిలకు దారులు మూసుకుపోయినట్లైంది.
ఎన్నికల్లో షర్మిల పార్టీ ప్రభావం ఉంటుందా..?
దీంతో ఏం చేయాలో తెలియక షర్మిల సతమతమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ విలీనం చేసి చక్రం తిప్పుదామనుకున్న షర్మిలకు కాంగ్రెస్ తలుపులు మూసివేయడంతో ఇక ఒంటరిగానే పోటీకి దిగాలని నిర్ణయించుకున్నారు. మొన్నటి దాకా విలీనం ఖాయమనుకున్న తరుణంలో ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడంతో షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఒంటిరి అయిపోయారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఒంటిరిగా పోటీ చేయాలని డిసైడ్ అయిన షర్మిల పార్టీ ఏ మేరకు ఎన్నికల్లో ప్రభావం చూపుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout