Rythu Bandhu:బిగ్ బ్రేకింగ్: రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ బ్రేక్
- IndiaGlitz, [Monday,November 27 2023]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. రైతులకు 'రైతుబంధు' సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు అనుమతి ఉపసంహరిస్తున్నట్లు ఈసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఎన్నికల ప్రచారంలో ఈనెల 28 నుంచి రైతుబంధు పంపిణీ చేస్తామన్న మంత్రి హరీశ్ రావు ప్రకటన ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని.. అందుకే రైతుబంధు నిధుల విడుదలకు బ్రేక్ వేస్తున్నట్లు వెల్లడించింది. నిధులు విడుదల చేయవద్దని ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత రైతు రుణమాఫీ అమలు, ఉద్యోగులకు మూడు డీఏల విడుదల, రైతుబంధుకు ఎన్నికల సంఘం అనుమతి కోసం ప్రభుత్వం లేఖలు రాసింది. అయితే ఎన్నికలకు ఐదు రోజుల ముందు రైతుబంధు పథకం అమలుకు అనుమతి ఇచ్చింది. ఈనెల 28వ తేదీ కల్లా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసుకోవచ్చునని తెలిపింది. 2018 అక్టోబర్ 5వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులను పూర్తి చేయాలని సూచించింది.
అయితే ఈసీ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఎన్నికలకు ముందు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించింది. మరోవైపు ఎన్నికల ప్రచారాల్లో మంత్రి హరీశ్ రావు పదే పదే రైతుబంధు నిధుల విడుదలపై వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. దీంతో హరీష్ రావు వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని ఈసీ పేర్కొంటూ రైతుబంధు నిధుల విడుదలకు అనుమతి రద్దు చేసింది. ఈసీ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో 70లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం నిలిచిపోనుంది.