Download App

Brand Babu Review

బాలీవుడ్ త‌ర్వాత పెద్ద సినీ మార్కెట్ ఇండియాలో టాలీవుడ్‌దే.. అదీ గాక ఇప్పుడు బాలీవుడ్‌తో పోటీ ప‌డేలా టాలీవుడ్‌లో కొత్త క‌థ‌ల‌తో సినిమాలు రూపొందుతున్నాయి. అంతే కాకుండా తెలుగు సినీ ప్రేక్ష‌కులు న‌చ్చితే హీరోల‌ను గుండెల్లో పెట్టుకుంటారు. సినిమాల‌కు ఇక్క‌డ ఉన్న ఆద‌ర‌ణే వేరు. కాబ‌ట్టి ప‌ర భాషా న‌టులు తెలుగు సినిమాల్లో న‌టిండ‌చానికి ఆస‌క్తి చూపిస్తుంటారు. అలాంటి ఆశ‌తో తెలుగు మూలాలు ఉన్న క‌న్న‌డ హీరో సుమంత్ శైలేంద్ర `బ్రాండ్ బాబు` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చారు. ఈటీవీ ప్ర‌భాక‌ర్ ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కించిన రెండో చిత్రమిది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు, స్క్రిప్ట్ అందించ‌డం విశేషం. మ‌రి బ్రాండ్‌బాబు ప్రేక్ష‌కుల మ‌న్న‌లు పొందాడా?  లేదా? అని తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థ‌:

ర‌త్నం(ముర‌ళీశర్మ‌) కోటీశ్వ‌రుడు. వారి హోదాకు త‌గ్గ‌ట్టే బ్రాండ్ ఉండాల‌నుకునే ర‌కం ర‌త్నం. త‌న‌తో పాటు త‌న కొడుకు డైమండ్ బాబు(సుమంత్ శైలేంద్ర‌)ను కూడా అలాగే పెంచుతాడు. త‌న హోదాకు త‌గ్గ‌ట్టు డైమండ్ బాబు మంచి హోదా, డ‌బ్బు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటూ ఉంటాడు. ఓరోజు డైమండ్ బాబు ఫోన్‌కి ఐ ల‌వ్ యు మెసేజ్ వ‌స్తుంది. ఆ వ‌చ్చిన ఫోన్ నెంబ‌ర్ హోం మినిష్టర్‌గారి అమ్మాయిద‌ని తెలుసుకుంటాడు డైమండ్ బాబు. ఆ అమ్మాయిని ప్రేమించే ప్ర‌య‌త్నంలో భాగంగా ఆమెకు ఫోన్‌లు చేస్తుంటాడు. కానీ నిజానికి డైమండ్ బాబు హోం మినిష్ట‌ర్ ప‌ని మ‌నిషి రాధ‌(ఈషారెబ్బా)కి ఫోన్ చేస్తుంటాడు. ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుడుతుంది. తీరా నిశ్చితార్థం స‌మ‌యంలో డైమండ్‌బాబుకి నిజం తెలుస్తుంది. అప్పుడు డైమండ్ బాబు ఏం చేస్తాడు? బ‌్రాండ్ కోసం ప్రేమ‌ను వ‌దుల‌కుంటాడా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్‌:

హీరో సుమంత్ శైలేంద్ర క‌న్న‌డంలో ఆల్ రెడీ నాలుగు సినిమాలు చేశాడు.. తెలుగులో తొలి సినిమా కాబ‌ట్టి న‌ట‌న ప‌రంగా సుమంత్ శైలేంద్ర బ్రాండ్ బాబు పాత్ర‌లో చ‌క్క‌గా యాప్ట్‌గా న‌టించాడు. హోమ్ మినిష్ట‌ర్ ప‌నిమ‌నిషి రాధ పాత్ర‌లో ఈషారెబ్బా చ‌క్క‌గా న‌టించింది. ముఖ్యంగా కామెడీ పండే స‌న్నివేశాల్లో త‌న‌దైన కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకుంది. ఇక ముర‌ళీశ‌ర్మ న‌ట‌న గురించి ప్ర‌స్తావించ‌న‌క్క‌ర్లేదు. త‌న పాత్ర‌లో ముర‌ళీశ‌ర్మ జీవించేశారు. వేణు, స‌త్యంరాజేష్‌, సాయి వారి వారి పాత్ర‌ల ప‌రిధులు మేర కామెడీతో ఆక‌ట్టుకున్నారు.

మైన‌స్ పాయింట్స్‌:

ఫ‌స్టాఫ్‌లో పాత్ర‌లు.. వాటి ప‌రిచ‌యాల‌తో సినిమా ఆసాంతం సాగిపోతే.. సెకండాఫ్ అంతా అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాల‌తో ప్రేక్ష‌కుల‌కి ప‌రీక్షే  పెట్టే ప్ర‌య‌త్న‌మే చేశారు. ఓ మంచి పాయింట్‌ను క్యారీ చేయాల్సిన సినిమా మ‌ధ్య‌లో పాయింట్‌ను డ్రాప్ చేసేసింది. స‌హ‌జ‌త్వానికి దూరంగా పాత్ర‌లు క‌న‌ప‌డ‌తాయి.

స‌మీక్ష:

క‌థ‌లో బ్రాండ్ అనే పాయింట్ పెట్టి ద‌ర్శ‌కుడు మారుతి ఓ క‌థ‌ను త‌యారు చేసినా.. సెకండాఫ్‌లో స‌న్నివేశాల మ‌ధ్య ఆస‌క్తి త‌గ్గింది. ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమాలో ఎమోష‌న్స్‌ను క్యారీ చేస్తూ మెసేజ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు కోసం ప్ర‌తి స‌న్నివేశాన్ని లింకు పెడుతూ గ్రిప్పింగ్‌గారాసుకోవాలి అది సినిమాలో క‌న‌ప‌డ‌దు. ముఖ్యంగా సెకండాఫ్‌లో క‌న్విన్స్ కానీ స‌న్నివేశాల‌తో నాట‌కీయంగా అనిపిస్తుంది.  హీరోయిన్‌ని ప్రేమ‌లో ప‌డేయ‌డానికి హీరో ప‌డే క‌ష్టాలు కూడా సిల్లీగా అనిపిస్తాయి. స‌త్యం రాజేశ్ పాత్ర ఏంటో... ఎందుకు స‌గంలో క‌ట్ అవుతుందో కూడా అర్థం కాదు. సినిమా అబ్ర‌ప్ట్ గా అనిపిస్తుంది. సామాన్యులు అంత తేలిగ్గా క‌నెక్ట్ అయ్యే విష‌యాలు ఇందులో పెద్ద‌గా క‌నిపించ‌వు. బాగా లీజ‌ర్‌గా టైమ్ ఉంటే ఒక‌సారి చూడొచ్చు

బోట‌మ్ లైన్‌: బ్రాండ్ బాబు.. మెప్పించ‌లేక‌పోయాడు

Brand Babu Movie Review in English

Rating : 2.3 / 5.0