close
Choose your channels

కళాకారుడు బీకేఎస్ వర్మకు దర్శకేంద్రుడు చేతుల మీదుగా స్వర్ణకంకణాన్ని బహూకరించిన బ్రహ్మానందం

Thursday, August 4, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆయన పేరున్న నటుడు. తెలుగు చలనచిత్ర సీమలో హాస్యమనే సామ్రాజ్యాన్ని ఏలుతున్న మకుటంలేని మహాచక్రవర్తి. ఆయన వృత్తి నటన. ప్రవృత్తి అధ్యయనం. సమకాలీన అంశాల నుంచి సాహిత్యం వరకు ప్రతి విషయాన్నీ అధ్యయనం చేయడంలో ముందుంటారు. క్షణం తీరిక లేకుండా వృత్తిలో అలిసిపోయి పక్కమీదకు చేరుకున్నప్పటికీ కునుకును కాసింత సేపు పక్కనుండమని ఆదేశించి ప్రవృత్తితో ముచ్చటించే లక్షణం ఆయనిది.

ఆ రోజు కూడా అంతే. పక్కమీదకు చేరుకున్నాక పక్కన టీపాయ్‌ మీదున్న వారపత్రికను చేతిలోకి తీసుకున్నారు. ఆ పత్రిక పేరు స్వాతి. గత కొన్ని దశాబ్దాలుగా వారం వారం క్రమం తప్పకుండా తెలుగువారిని పలకరిస్తున్న వారపత్రిక అది. లోపలి అంశాలతో ఆకట్టుకోవడం కాదు... ఏకంగా ముఖచిత్రం నుంచే పాఠకులను మెప్పించాలనే లక్షణం ఉన్న పత్రిక. ఆ వారం ఆ పత్రిక ముఖచిత్రం సాక్షాత్తు ఏడుకొండల నామాలమూర్తి వేంకటేశ్వరుడిది. శ్రీనివాసుడి చిత్రాన్ని చూస్తున్న కొద్దీ చూడాలనిపించింది మన హాస్యనట చక్రవర్తికి. చూసే కొద్దీ తనివి తీరలేదు. తన్మయత్వం ముంచెత్తింది. ఆ ముఖ వర్ఛస్సు, ఆ ఠీవి, ఆ కటిముద్ర, వరద హస్తం, శంఖచంక్రాలు, వనమాల, పంచపాత్ర... ఒకటేంటి... ప్రతిదీ వెయ్యి కళ్ళతో చూడాల్సినంత సహజంగా అనిపించింది. చూసేకొద్దీ కొత్తగా, గొప్పగా, భక్తిగా కనిపించసాగింది. ఆ గోవిందుని స్మరించుకుంటూ ఆ పూటకి నిద్రలోకి జారుకున్నాడు. కలంతా ఆ ముఖచిత్రమే. హఠాత్తుగా మెలకువ వచ్చింది. ఆ పత్రికను చేతులోకి తీసుకుని బెడ్‌లైట్‌ వెలుతురులో మరొక్కమారు చూశారు. అందులో బీకేఎస్‌ వర్మ అనే పేరు కనిపించింది. ఎవరో కొత్త కుర్రాడిలా ఉన్నాడు. ఎంత అద్భుతంగా గీశాడు. సరస్వతీతల్లి ఎంత గొప్పగా అతని కుంచెను కటాక్షించింది అనుకుంటూ మరలా నిద్రలోకి జారుకున్నారు. తెలతెలవారుతుండగానే చేతిలోకి సెల్‌ తీసుకుని స్వాతి ఎడిటర్‌కు ఫోన్ చేసి నెంబర్‌ తీసుకున్నారు. ఆ చిత్రకారుడికి ఫోన్ చేసి...

నేను బ్రహ్మానందాన్ని మాట్లాడుతున్నాను. బావున్నారా`` అని అడిగారు.

బావున్నానండీ. బ్రహ్మానందం అంటే..`` అని వినిపించింది అవతలి నుంచి.

మీరనుకుంటున్నదే నేను నటుడు బ్రహ్మానందాన్నే`` చెప్పారు బ్రహ్మానందం.

ఆ తర్వాత వారిద్దరి మధ్య సంభాషణ చాలా సేపు సాగింది....

మాటల్లో తెలిసింది విషయం ఏంటంటే బీకేఎస్‌ వర్మ కొత్త ఆర్టిస్టు కాదు. యువకుడు అంత కన్నా కాదు. వర్ధమాన కళాకారుడు కాదు. కర్ణాటకలో గొప్ప పేరున్న ఆర్టిస్టు. ఆయన కుంచె విదిలిస్తే చాలని ఎదురుచూసే అభిమానులు ఆయనకు కోకొల్లలు. అవతలి వారు అడిగారని ఆయన బొమ్మలు గీయరు. మనసుకు నచ్చితేనే గీస్తారు. అది కూడా తదేకదీక్షతో వేస్తారు. ఆ భగవంతుడే తన చేత వేయించుకుంటున్నారనే విశ్వాసంతో రంగులు తీర్చిదిద్దుతారూ...`` అని. అలా ఇద్దరి పరిచయాలు పూర్తయ్యాయి. స్వతహాగా వేంకటేశ్వరస్వామి భక్తుడైన బ్రహ్మానందానికి ఓ కోరిక కలిగింది. తమ కొత్త ఇంటి హాల్లో బీకేఎస్‌ వర్మగారి చేత వేంకటేశ్వరస్వామి తైలవర్ణ చిత్రాన్ని గీయించుకుంటే ఎలా ఉంటుంది?` అన్నది ఆ కోరిక. ఫోనులో అదే విషయాన్ని ఆయనతో పంచుకున్నారు. సాక్షాత్తు భగవద్రూపాన్ని కోరుతున్నారు కాబట్టి వర్మ వెంటనే అంగీకరించారు.

దాదాపు దాదాపు తొమ్మిది మాసాల సమయాన్ని తీసుకున్నారు. ఆరు ఇంటూ ఎనిమిది అడుగుల కొలతలతో పద్మావతీపతి రూపాన్ని కన్నులవిందుగా తీర్చిదిద్దారు. బహు జాగ్రత్తగా ఆ వేంకటేశ్వరుడి చిత్ర పటం బ్రహ్మానందం కొత్త ఇంటి హాలుకు శోభను చేకూర్చింది.

అప్పటినుంచి బ్రహ్మానందం ఇంటికి ఎవరొచ్చినా ఒకటే మాట... ఎంత అద్భుతంగా ఉంది. చూడగానే ఆశ్చర్యచకితులమైపోతున్నాం. ఆ ఏడుకొండలవాడిని సాక్షాత్తూ చూస్తున్నట్టు ఉంది. సూక్ష్మాంశాలను కూడా ఇంత సునిశితంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఎవరు? ఆ నామాలమూర్తిని ఇంత శోభాయమానంగా కొలువుతీర్చిన కుంచె ఎక్కడిది`` అని.

తనను ఆరాతీసిన ప్రతి ఒక్కరినీ, మూర్తి రూపాన్ని దర్శించి మురిసిపోయిన వారందరినీ గురువారం తన గృహానికి పిలిపించారు బ్రహ్మానందం. బహుసుందరంగా కోనేటిరాయుడిని తీర్చిదిద్దిన కుంచెను, ఆ కుంచెను పట్టుకున్న వేళ్లను, ఆ వేళ్లకు సొంతమైన మనిషిని బీకేఎస్‌ వర్మగా పరిచయం చేశారు. వెండితెరమీద శతాధిక చిత్రాలను రూపుదిద్దిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఆ కళాకారుడికి స్వర్ణకంకణాన్ని బహూకరించి సత్కరించారు.

ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ స్వాతి ముఖచిత్రం మీద బీకేఎస్‌వర్మ గీసిన వేంకటనాథుని చూసినప్పుడు ఆశ్చర్యచకితుడినయ్యాను. ఆ రూపాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దారో కదా అని ప్రశంసిద్దామని ఫోన్ చేశాను. వర్మగారికి కర్ణాటకలో ఉన్న పేరును తెలుసుకుని అబ్బురపడ్డాను. ఆయనతో తైలవర్ణ చిత్రాన్ని గీయించుకోవాలన్న అభిలాషను ముందుంచాను. దాదాపు తొమ్మిది నెలలు ఆయన కఠోరదీక్షతో ఆ బొమ్మను గీసిన వైనం నాకు తెలుసు. ఎంత తపస్సుతో బొమ్మను గీశారో అర్థం చేసుకోగలను. ప్రతి సారీ హాల్లో ఆ దివ్యమూర్తిని చూస్తున్నప్పుడల్లా నా ఒళ్లు పులకించిపోతోంది. ఇవాళ అందరూ ఆ చిత్రకారుడిని అభినందిస్తుంటే ఆయనతో పాటు నేను కూడా మురిసిపోతున్నాను. ఇంతటి సరస్వతీపుత్రుడిని అందరికీ పరిచయం చేయాలనిపించింది. ఆ కుంచెను పట్టుకునే చేతులకు స్వర్ణకంకణాన్ని తొడగాలనిపించింది`` అని తెలిపారు.

బీకేఎస్‌ వర్మ మాట్లాడుతూ నేను బ్రహ్మానందంగారికి అభిమానిని. ఆయన నటనంటే నాకు చాలా ఇష్టం. నవ్వడాన్ని మించిన భోగం ఏముంటుంది? అందరినీ నవ్వులతో ముంచెత్తగల హాస్య చక్రవర్తి ఆయన. అలాంటి వ్యక్తి నాకు ఫోన్ చేసినప్పుడు చాలా సంతోషించాను. ఆయన అడగ్గానే తైలవర్ణచిత్రపటాన్ని గీయడానికి సిద్ధమయ్యాను. తొమ్మిది నెలలు కష్టపడి రూపుదిద్దాను. నాతో సాక్షాత్తు ఆ వేంకటేశ్వరుడే తన రూపాన్ని గీయించుకున్నారన్నది నా విశ్వాసం`` అని చెప్పారు. స్వామి మహర్షి గురుజీ, సంజయ్‌ కిశోర్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.​

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment