ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసిన బోయపాటి
- IndiaGlitz, [Friday,May 01 2020]
మాస్ యాంగిల్లో సినిమాలు చేసే దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. ప్రస్తుతం ఈయన నందమూరి బాలకృష్ణతో మూడో సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలుఉన్నాయి. ఇప్పటికే రామోజీ ఫిలింసిటీలో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. కరోనా ఎఫెక్ట్ వల్ల సినిమా షూటింగ్ ఆగింది. ఈ గ్యాప్‌లో ఈ సినిమాకు సంబంధించి పలు విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వాటిలో ఓ విషయం బాలయ్య ఈ చిత్రంలో అఘోరా పాత్రలో కనపడబోతున్నాడనేది. అసలు బాలయ్య అఘోరా కనపడటం ఏంటనే మీమాంస బాలయ్య అభిమానుల్లో ఉండేది. ఈ విషయంపై డైరెక్టర్ బోయపాటి శ్రీను రీసెంట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. బయట వినిపిస్తున్న వార్తల ప్రకారం తాను డైరెక్ట్ చేస్తున్న చిత్రంలో బాలయ్య అఘోరాగా కనపడనున్నాడనేది నిజమని తెలిపారు. సింహా,లెజెండ్ చిత్రాల కంటే ఈ సినిమా మరింత బావుంటుందని ఈ సందర్భంగా బోయపాటి తెలిపారు. ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.