మళ్లీ మళ్లీ.. బొత్స నోట అదే మాట.. అసలేంటి కథ!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన విషయం విదితమే. బొత్స మాటలతో అటు రాజధాని రైతులు, ఇటు ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ దీన్నే సువర్ణావకాశంగా భావించి చేయాల్సిన పనులన్నీ చేసేశారు. అయితే తాజాగా మరోసారి మీడియాతో మాట్లాడిన బొత్సా.. ‘నా దారి రహదారి.. మళ్లీ మళ్లీ పాడాలి ఈ పాట అన్నట్లుగా ’ మరోసారి రాజధానికి సంబంధించి అదే వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యారు.
అసలేం జరుగుతోంది..!
రాజధాని విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ఇంతకు మందు తాను చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని మరోసారి చెప్పడం గమనార్హం. విజయనగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన బొత్స పై వ్యాఖ్యలు చేశారు. కాగా పదే పదే బొత్స ఎందుకిలా మాట్లాడుతున్నారు..? ముఖ్యమంత్రే ఇలా బొత్సా దగ్గర చెప్పిస్తున్నారా.. ఏంటి..? అని మరోసారి రాజధాని రైతుల్లో అలజడి మొదలైంది. ఇంతకీ రాజధాని వేదికగా అసలేం జరుగుతోంది..? అసలేంటి కథ..? అనేది తెలియాల్సి ఉంది.
పవన్ వ్యాఖ్యలపై..!
రాజధాని మారిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూ పోతే పరిస్థితేంటి..? అన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బొత్స స్పందించారు. పవన్ వ్యాఖ్యలు.. ద్వంద్వ వైఖరిలా ఉన్నాయని.. రాజధాని ప్రాంతానికి వరద ముంపు ఉందని, గత ప్రభుత్వం శివరామకృష్ణ కమిటీ సలహాలపై నిర్లక్ష్యం వహించిందని మళ్లీ బొత్సా అదే మాట చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతిలో రాజధాని నిర్మాణం ఆర్థిక భారమవుతుందని.. రాజధాని ఏ ఒక్కరిదో.. ఏ ఒక్క సామాజికవర్గానిదో కాదని ఈ సందర్భంగా బొత్స చెప్పుకొచ్చారు.
11లక్షల క్యూసెక్కుల వరద నీరొస్తే..!
"కేవలం 8 లక్షల క్యూసెక్కుల వరద నీటికే రాజధాని ప్రాంతం ముంపునకు గురైంది. అలాంటప్పుడు 11 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తే పరిస్థితి ఏంటి..?." అని విమర్శకులపై బొత్సా ప్రశ్నాస్త్రాలు సంధించారు. మరి ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలకు చెందిన నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout