రామోజీ రావుపై ఆగ్రహంతో ఊగిపోయిన బొత్స
Send us your feedback to audioarticles@vaarta.com
2019 ఎన్నికల అనంతరం అఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ఈనాడు’,‘ఆంధ్రజ్యోతి’ మీడియా సంస్థలపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ప్రచార సభల్లో మొదలుకుని అసెంబ్లీ వరకూ ప్రతి చోటా ఈ రెండు మీడియా సంస్థల పేర్లు మంత్రులు, జగన్, ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా మూడు రాజధానుల వ్యవహారం, ఇంగ్లీష్ మీడియం, శాసన మండలి రద్దు వ్యవహారంపై ఈ రెండు మీడియా సంస్థలకు చెందిన పత్రికలు, టీవీ చానెల్స్ పెద్ద ఎత్తున కథనాలు రాస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా ముందుకొచ్చారు. ‘అప్పుడలా.. ఇప్పుడిలా.. ఎందుకిలా ఈనాడు రామోజీరావ్’ అంటూ ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు.
అప్పుడలా.. ఇప్పుడిలా!
‘శాసన సభ ద్వారా సీఎం జగన్ ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావులను ప్రకటన ద్వారా కోరారు. సలహాలు ఇచ్చేందుకు కాకుండా నిబంధనలకు తూట్లు పొడుస్తూ, ప్రజా తీర్పును శాసన మండలి అవహేళన చేస్తోందని సీఎం అన్నారు. ఈ పరిస్థితుల్లో శాసన మండలి అవసరమా..? అని సీఎం అన్నారు. అయితే.. ప్రస్తుతం శాసన మండలి రద్దుపై చర్చలు జరుగుతున్నాయి. శాసన మండలి రద్దు చేయాలా..? వద్దా..? అనే అంశంపై మేధావులు వారి అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు రెండు రోజులుగా ఏదేదో ప్రచారం చేస్తున్నాయ్. శాసన మండలిలో జరిగే పరిణామాలను మీరు సమర్థిస్తున్నారా..? వ్యతిరేకిస్తున్నారా..? అని రామోజీరావును సూటిగా అడుగుతున్నాను. ఎన్టీఆర్ హయాంలో మండలి రద్దును ఈనాడు సమర్థించింది. ఇప్పుడు అదే ఈనాడు శాసన మండలి రద్దును వ్యతిరేకిస్తోంది’ అని బొత్స తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు.
మీ వైఖరేంటో చెప్పండి..!
‘ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ బిల్లును తీసుకొవచ్చి 5కోట్ల ప్రజల అభివృద్దికి కృషిచేస్తుంది. ఎస్సీ కమిషన్ బిల్లు సహా ఇంగ్లీష్ మీడియం బిల్లులను తెస్తే శాసన మండలిలో వ్యతిరేకించారు. ఒక వ్యక్తిని కాపాడేందుకు రామోజీరావు గతంలో ప్రయత్నించారు. ఈనాడు అధినేత రామోజీరావు వైఖరేమిటో స్పష్టంగా చెప్పాలి. ఆపరేషన్ ఆకర్ష పేరిట.. ఒక్కో శాసన మండలి సభ్యుడికి 5కోట్లు ఎర చూపారని ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఈనాడులో రాశారు.. చంద్రబాబు విధానాలకు రామోజీరావు కొమ్ముకాస్తున్నారు. సంతలో పశువుల కంటే హీనంగా చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను కొన్నారు. ప్రజాపకరంగా పాలన చేయాలనేదే సీఎం జగన్ ఆశయం. మేధావుల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకే రెండు రోజులు గడువును సీఎం ఇచ్చారు. మండలిలో రూల్స్ కు విరుద్దంగా విచక్షణా అధికారాన్ని వినియోగించారు. మండలిలో దుష్టా సాంప్రదాయాలకు తెరతీశారు’ అని బొత్సా మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. కాగా.. బొత్స వ్యాఖ్యలపై ఈనాడు ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments