రాజధాని అమరావతిపై బొత్సా తాజా ప్రకటన ఇదీ...
- IndiaGlitz, [Friday,August 23 2019]
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం విదితమే. అసలు రాజధాని అమరావతిలో ఉంటుందా..? లేదా..? అని రాజధాని రైతుల్లో.. ఏపీ ప్రజల్లో పెను అనుమానాలు రేకెత్తాయి. అంతేకాదు రాజధాని సమీప ప్రాంతాల్లో ఒక్కసారిగా భూముల రేటు డౌన్ అయిపోయింది. పార్టీకి చెందిన నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు మీడియా ముందుకు వచ్చి రాజధానిని ఎక్కడకీ తరలించట్లేదని చెప్పినప్పటికీ పరిస్థితులు అదుపులోకి రాలేదు.
సీబీఐ నోటీసులపై స్పందన!
బొత్సకు సీబీఐ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాదులోని సీబీఐ కోర్టు సమన్లను జారీ చేసింది. వచ్చే నెల 12న విచారణకు హాజరు కావాలని బొత్సను కోర్టు ఆదేశించింది. ఫోక్స్ వ్యాగన్ కేసులో ఆయన సాక్షిగా ఉండటంతో ఆయనకు సమన్లు జారీ చేయడం జరిగింది. తాజాగా ఈ వ్యవహారంపై.. ఫోక్స్ వ్యాగన్ కేసులో తనను సాక్షిగా మాత్రమే పిలిచారని బొత్స స్పష్టం చేశారు.
అబ్బే నేనలా అన్లేదే!?
రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణన్ రిపోర్టును పరిగణనలోకి తీసుకోలేదని మాత్రమే నేను చెప్పాను. రాజధాని విషయంలో నేను మాట్లాడింది వరదల గురించి మాత్రమే. పదేళ్ల క్రితం 12 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే అతలాకుతలమైందని, మొన్న 8 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది. రాజధాని విషయంలో శివరామకృష్ణన్ రిపోర్టు కాకుండా నారాయణ రిపోర్టు అమలు చేశారు అని బొత్సా చెప్పుకొచ్చారు.
అక్కడ రాజధానులు కట్టేవారా..?
అంతటితో ఆగని ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై కూడా స్పందించారు. ‘చంద్రబాబు మాటలు చూస్తుంటే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మాట్లాడుతున్నట్టే ఉంది. అమరావతి చుట్టూ టీడీపీ నేతలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది కాబట్టే భయపడుతున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ది జరగాలి. తద్వారా రూ.25లక్షల కోట్ల సంపదను సృష్టించబోతాం. చెన్నై, ముంబైలు ఎప్పుడో నిర్మితమైన రాజధానులని, వాటితో అమరావతికి పోలిక ఏంటి..?. ముంపునకు గురవుతుందని తెలిస్తే అక్కడ రాజధానులు కట్టేవారా..?’ అని ఈ సందర్భంగా చంద్రబాబుపై.. బొత్సా సూటి ప్రశ్నల వర్షం కురిపించారు.