బాబూ.. పిచ్చి వేషాలు మానుకో.. పప్పులేం ఉడకవ్ : బొత్స
- IndiaGlitz, [Thursday,September 12 2019]
ఆంధ్రపదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ తలపెట్టిన ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమం అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు మొదలుకుని ద్వితియ శ్రేణి నాయకులవరకూ అందర్నీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి.. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా ఏపీ పోలీసులు చాలా జాగ్రత్తపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు వేసిన పాచికలను వైసీపీ సర్కార్ ఏ మాత్రం పారనీయలేదని స్పష్టంగా అర్థమైంది. ఆఖరికి చంద్రబాబు చేసేదేమీ లేక ఇంట్లోనే నిరాహారదీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పిచ్చి వేషాలు మానుకోవాలి!
ఈ చలో ఆత్మకూరు నేపథ్యంలో తలెత్తిన పరిణామాలపై మంత్రి బొత్స సత్యనారయణ మీడియా ముందుకొచ్చి.. టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటాన్ని చంద్రబాబు అస్సలు తట్టుకోలేకపోతున్నారని బొత్సా ధ్వజమెత్తారు. ‘చంద్రబాబుకు ఇలాంటి జిమ్మిక్కులు కొత్త కాదు. ఇకనైనా ఇలాంటి పిచ్చి వేషాలు మానుకోవాలి. ఏపీ సీఎం జగన్ వంద రోజుల పాలనలో అవినీతికి తావులేదు. టీడీపీ నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మారారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు చంద్రబాబు, టీడీపీ నేతల ప్రయత్నిస్తున్నారు’ అని ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో మంత్రి బొత్స ధ్వజమెత్తారు.
మీలాగా కాదు బాబూ..!
ఈ సందర్భంగా 2014 ఎన్నికల అనంతరం చంద్రబాబు మాట్లాడిన మాటలను బొత్స గుర్తు చేసి మరీ విమర్శనాస్త్రాలు విసిరారు. అయితే మా ముఖ్యమంత్రి జగన్.. చంద్రబాబులా కాదని.. శాంతిభద్రతలపై జగన్ తన వైఖరి ఏంటో మొదటి కలెక్టర్ల సదస్సులోనే స్పష్టం చేశారన్నారి చెప్పుకొచ్చారు. పేకాట క్లబ్బులు, రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని ఉపేక్షించొద్దని.. ప్రజాప్రతినిధులకు విలువ ఇవ్వాలని, అంతేకానీ వారు చెప్పినవన్నీ చేయాల్సిన పనిలేదన్న జగన్ మాటలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.
ఆ పప్పులేం ఉడకవ్..!
‘చంద్రబాబూ నీ జిమ్మిక్కులు చెల్లవు. నీ గుణం మాకు తెలుసు. నువ్వు ఇంకా పాత స్ట్రాటజీలనే ఫాలో అవుతున్నావ్.. జగన్ అలా కాదు.. నీ జిమ్మిక్కుల్లో జగన్ పడరు. ఆ పప్పులేం ఉడకవ్. టీడీపీ నేతలు ఎంతగా ప్రయత్నించినా మీ బుట్టలో మేం పడబోం. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో పోలీసులు చక్కగా పని చేశారు. సీఎం జగన్ కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారని... చంద్రబాబు మాత్రం ఇంకా తన పాత విధానాలు, కుట్రలతోనే ముందుకెళ్లాలని చూస్తున్నారు. ఇలాంటి వాటిని వైసీపీ సర్కార్ ఏ మాత్రం సహించదే’ అని మంత్రి బొత్సా తేల్చిచెప్పారు. అయితే బొత్సా విమర్శలపై తెలుగు తమ్ముళ్లు.. మరీ ముఖ్యంగా టీడీపీ అధినేత బాబు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.