Botsa:వైవీ వ్యాఖ్యలను ఖండించిన బొత్స.. ఉమ్మడి రాజధాని అంశంపై వైసీపీ యూటర్న్..
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కలకలం రేపాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు వైసీపీ అధిష్టానం సిద్ధమైంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది తమ పార్టీ విధానం కాదని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేస్తారా..? అని ప్రశ్నించారు. పదేళ్ల తరువాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యమవుతుందని తెలిపారు. అర్థరాత్రి చంద్రబాబు పారిపోయి వచ్చిన కారణంగా ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని విమర్శించారు. అందుకే ఇప్పుడీ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.
అలాగే తెలంగాణ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ ఏమైనా ఆయన సొంత ఆస్తినా.? బీఆర్ఎస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. హైదరాబాద్ లాంటి నగరంలో ఎవరికైనా ఆస్తులు ఉండవచ్చని.. తనకు అక్కడ ఇల్లు ఉందన్నారు. తాను ఏపీలో మంత్రిని అయ్యానని.. తన ఇల్లును ఏమైనా కబ్జా చేస్తారా..? అని నిలదీశారు. రాజధాని అంశంపై లబ్ధి పొందాల్సిన అవసరం వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు. ఉమ్మడి రాజధాని తమ పార్టీ విధానం కాదంటూ క్లారిటీ ఇచ్చారు. విభజన చట్టంలో ఏపీకి రావాల్సిన ఆస్తుల గురించి.. ఆ సమస్యల పరిష్కారం గురించే వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారని పేర్కొన్నారు.
కాగా రెండు రోజుల క్రితం టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైజాగ్‌లో పరిపాలన రాజధాని ఏర్పాటు అయ్యే వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచే అంశంపై కేంద్రంతో చర్చిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితులు లేవని.. ఈ అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. జూన్‌తో ఉమ్మడి రాజధాని గడువు ముగియనున్న నేపథ్యంలో మరికొన్ని రోజులు పొడగించాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పుకొచ్చారు. దీంతో వైవీ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
వైవీ వ్యాఖ్యలను తెలంగాణ నేతలు తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌ను ఏపీకు రాజధానిగా కొనసాగించాలనే వైసీపీ నేతల డిమాండ్ హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో వైసీపీ నాయకుల నుంచి ఈ మాటలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఎప్పటికీ తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీపడబోమని.. తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. వైసీపీ నేతల స్వార్థ పూరిత రాజకీయాల కోసం తెలంగాణ జోలికి రావొద్దని ప్రశాంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout