రాంగోపాల్ వర్మ సోదరుడు మృతి.. బోనీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్

  • IndiaGlitz, [Monday,May 24 2021]

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు వరుసకు సోదరుడైన సోమశేఖర్ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా కరోనాతో భాదపడుతున్న సోమశేఖర్ హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మరణించారు. అనేక చిత్రాలకు ఆయన నిర్మాణ భాద్యతలు వహించారు.

సినిమాలకు గ్యాప్ తీసుకుని వ్యాపారాల్లో బిజీ అయ్యారు. పలు సందర్భాల్లో వర్మ కూడా సోమశేఖర్ గురించి ప్రస్తావించారు. తన జీవితంలో సోమశేఖర్ కీలకమైన వ్యక్తి. ఆయన్ని మిస్ అవుతున్నట్లు గతంలోనే వర్మ తెలిపారు.

వర్మ తెరకెక్కించిన రంగీలా, సత్య, కంపెనీ లాంటి చిత్రాలకు నిర్మాణ భాద్యతలు వహించింది సోమశేఖరే. అలాగే దర్శకుడిగా మారి 'మస్కురాకే దేఖ్ జర' అనే చిత్రాన్ని రూపొందించారు. సోమశేఖర్ కు చాలా మంది ప్రముఖులతో సాన్నిహిత్యం ఉంది.

సత్య షూటింగ్ సమయంలో తాము వర్మ కంటే సోమశేఖర్ కే ఎక్కువ భయపడేవాళ్ళం అని గతంలో జేడి చక్రవర్తి తెలిపారు. సోమశేఖర్ మృతి పట్ల బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమశేఖర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ' నా పాత మిత్రుడిని కోల్పోయా. వరుసగా విషాద వార్తలే వినాల్సి వస్తోంది. సోమశేఖర్ కరోనాకి గురైన తన తల్లి పట్ల ఎంతో కేర్ తీసుకునేవారు. ఆయన కూడా కరోనా బారీన పడ్డారు.అయినప్పటికీ తన తల్లిని చూసుకోవడం మాత్రం ఆపలేదు అంటూ బోనీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.