‘వంశీ.. ఏంటీ వాట్సాప్ న్యూసెన్స్.. రాజీనామా చేసి వెళ్లిపోవచ్చు’!
- IndiaGlitz, [Monday,October 28 2019]
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా లేఖపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ముఖ్యనేత బోండా ఉమా మహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటే సంప్రదాయ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ ఇవ్వాలన్నారు. ‘వాట్సాప్ మెసేజ్‌లతో ఈ న్యూసెన్స్ ఏంటి..?. రాజీనామా చేయాలనుకుంటే డైరెక్టుగా చేయొచ్చు. ఫోన్‌లో మెసేజ్‌లలో రాజీనామాలు ఏంటో అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే పదవిని వదులుకోవాలనుకుంటే స్పీకర్ ఫార్మాట్‌లో లేఖ పంపాలి. వాట్సాప్ ద్వారా పంపే మెసేజ్‌లు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు. వైసీపీ వేధింపుల వల్లే రాజీనామా చేస్తున్నానని వంశీ చెప్పారు.. అలాంటప్పుడు మళ్లీ అదే పార్టీలోకి ఎందుకు వెళ్తారు?. వంశీ పార్టీ మారే వ్యవహారంలో కొందరు గందరగోళం సృష్టిస్తున్నారు. పార్టీ మారే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది’ అని ఈ సందర్భంగా బోండా చెప్పుకొచ్చారు.
రాజీనామా చేసి వెళ్లిపోవచ్చు!
‘ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, ఎంపీ సుజనా చౌదరి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంటి నాయకులను వంశీ కలిశారు. రేపొద్దున మళ్లీ చంద్రబాబును కలిసినా కలవొచ్చు. వంశీ చర్యలను ప్రజలే తప్పు పడుతున్నారు వైసీపీ ప్రభుత్వ దాడులను ఎదుర్కునేందుకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది. నిజంగా పార్టీ మారాలనుకుంటే సాంప్రదాయ ఫార్మాట్‌లో రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు. ఈ గందరగోళ పరిస్థితులకు ఇప్పటికైనా పుల్ స్టాప్ పెట్టి వంశీ మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది’ అని వల్లభనేని వంశీ లేఖపై బోండా వ్యాఖ్యానించారు.
బుజ్జగింపులు!
అయితే వంశీపై బోండా చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై వంశీ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి. కాగా.. వంశీని బుజ్జగించేందుకు ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల సత్యనారాయణలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దింపారు. వారిద్దరూ వంశీతో సుమారు గంటపాటు చర్చించినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం కేశినేని మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు కానీ వంశీ మాత్రం ఆ సాహసం చేయలేదు.