బొమ్మరిల్లు కు పది వసంతాలు
- IndiaGlitz, [Tuesday,August 09 2016]
అంతేనా...ఇంకేమీ లేదా.. కుదిరితే నాలుగు మాటలు..కప్పు కాఫీ..
అంటూ తెరపై సందడి చేసిన సిద్ధార్థ్, జెనిలియా కాంబినేషన్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే సినిమా పేరు బొమ్మరిల్లు.ఇప్పటికీ ఈ డైలాగ్ చాలా మంది రింగ్ టోన్స్‌గా ఉందంటే సినిమా ఏ రేంజ్ ఎఫెక్ట్ చూపిందో అర్థం చేసుకోవచ్చు. భాస్కర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం 2006, ఆగస్ట్ 9న విడుదలై నేటికి సరిగ్గా పది వసంతాలను పూర్తి చేసుకుంటుంది.
తండ్రి మాట కాదనలేక తన తాను మార్చుకోలేక ఇబ్బంది పడే కొడుకు పాత్రలో సిద్దార్థ్, తనయుడుకి ఏ కష్టం రాకుండా చూడాలనుకునే తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే అమ్మాయి పాత్రలో జెనిలియా ..ప్రధానంగా ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇటు యూత్‌ను, అటు ఫ్యామిలీ ఆడియెన్స్ సహా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్‌గా నిలిచిపోయింది. మొత్తం మీరే చేశారంటూ వచ్చే క్లైమాక్స్ ఇప్పటికీ ఆడియెన్స్ ఊహల్లో మొదలుతూనే ఉంటుంది. ఆర్టిస్టుల అద్భుతమైన నటన, అబ్బూరి రవి డైలాగ్స్, భాస్కర్ స్క్రీన్‌ప్లేతో పాటు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, విజయ్.సి.చక్రవర్తి సినిమాటోగ్రఫీ ఇలా అన్నీ ఎలిమెంట్స్ సినిమాకు పక్కాగా అమరి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.