భీమవరం టాకీస్ 'బొంబాయి మిఠాయి' ట్రైలర్ ఆవిష్కరణ!

  • IndiaGlitz, [Tuesday,January 05 2016]

భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న తాజా చిత్రం "బొంబాయి మిఠాయి". కన్నడంలో రూపొందిన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ ను దర్శకనిర్మాత రాజ్ కందుకూరి సమర్పణలో అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ.

నిరంజన్ దేశ్ పాండే, దిషాపాండే, చిక్కన్న, విక్రమ్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి చంద్రమోహన్ దర్శకుడు. సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో "బొంబాయి మిఠాయి" ట్రైలర్ ను విడుదల చేసారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు, నటులు గజల్ శ్రీనివాస్, బిజెపి స్పోక్ పర్సన్ ఉప్పల శారద, లయన్ సాయివెంకట్, నిర్మాత బి.సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ డా.శివ వై.ప్రసాద్, బి.సత్యనారాయణ, సింగర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్పోక్ పర్సన్ ఉప్పల శారదగార్ని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ శాలువాతో సత్కరించారు.

ముఖ్య అతిధిగా విచ్చేసిన గజల్ శ్రీనివాస్ "బొంబాయి మిఠాయి" ట్రైలర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ... ""బొంబాయి మిఠాయి" ట్రైలర్ చూస్తుంటే నాకు "ఎ ఫిలిం బై అరవింగ్" గుర్తుకొస్తోంది. నా చిరకాల మిత్రులు రామసత్యనారాయణగారు, రాజ్ కందుకూరిగారు సంయుక్తంగా ఈ కన్నడ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అనువాదరూపంలో అందిస్తుండడం ఆనందంగా ఉంది. పేరుకి చిన్న సినిమా అయినప్పటికీ.. భారీ కలెక్షన్స్ సాధించేందుకు కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమా తప్పకుండా ఘన విజయం సొంతం చేసుకొంటుందని ఆశిస్తున్నాను" అన్నారు.

చిత్ర సమర్పకులు రాజ్ కందుకూరి మాట్లాడుతూ... "నిజానికి "బొంబాయి మిఠాయి" చిత్రాన్ని నేను తెలుగులో అనువదం చేద్దామనుకోన్నాను. అదే సమయంలో రామసత్యనారాయణగారు కూడా ఈ సినిమా కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఇద్దరం ఈ సినిమా కోసం పోటీపడే కంటే.. కలిసి విడుదల చేస్తే బాగుంటుందని ఆయనే అన్నారు. ఆయనతో పనిచేయడంలో సౌలభ్యం తెలిసిన నేను వెంటనే ఓకే అన్నాను. ఇకపై కూడా మా ఈ అనుబంధం ఇలాగే కొనసాగుతుంది. మా ఇద్దరి కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు వస్తాయి" అన్నారు.

చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ... "కన్నడలో కేవలం 2 కొట్ల బడ్జెట్ లో రూపొంది 15 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రమిది. తెలుగులోనూ అదే స్థాయి విజయం సాధిస్తుందన్న నమ్మకంతోనే అనువదిస్తున్నాం. రాజ్ కందుకూరి గారితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉంది. "ట్రాఫిక్" సినిమాకు సంభాషణలు సమకూర్చిన కృష్ణతేజ "బొంబాయి మిఠాయి"కి కూడా మాటలు అందించారు. 2015లో వరుస చిత్రాలతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా మొదలైన నా ప్రస్థానాన్ని 2016లో కొనసాగిస్తానన్న నమ్మకం ఉంది. జనవరి 22న "బొంబాయి మిఠాయి" చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారన్న నమ్మకం ఉంది" అన్నారు.

బిజెపి స్పోక్ పర్సన్ ఉప్పల శారద మాట్లాడుతూ... "చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిని కానప్పటికీ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన రామసత్యనారాయణగారికి ధన్యవాదాలు. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాతగా ఆయనకు మరింత మంచి పేరు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను" అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులందరూ "బొంబాయి మిఠాయి" చిత్రం ఘన విజయం సాధించి.. నిర్మాతగా తుమ్మలపల్లి రామసత్యనారాయణకు మంచి పేరుతోపాటు భారీ లాభాలు తెచ్చిపెట్టాలని అభిలషించారు.

ఈ చిత్రానికి సంగీతం: వీర్ సమరత్, మాటలు: కృష్ణతేజ, పాటలు: పోతుల రవికిరణ్, ప్రెస్ రిలేషన్స్: ధీరజ అప్పాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శివ వై.ప్రసాద్- బి.సత్యనారాయణ, సమర్పణ: రాజ్ కందుకూరి, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: చంద్రమోహన్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ!