సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటిని బాంబుతో పేల్చివేస్తా మంటూ బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ నిర్వహించగా.. మతిస్థిమితం లేని వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడినట్టు గుర్తించారు. ఆ వ్యక్తిని హెచ్చరించి వదిలేశారు. అసలు విషయంలోకి వెళితే.. ఎగ్మూర్‌లో ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్‌కు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఒక అపరిచిత వ్యకి మాట్లాడుతూ.. ఆళ్వార్‌పేట చిత్తరంజన్ వీధిలోని ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంట్లో బాంబు పెట్టామని.. మరి కొద్దిసేపట్లో అది పేలుతుందని చెప్పి ఫోన్ కట్ చేశాడు.
ఇదీ చదవండి: పోలీసులకు ఫిర్యాదు చేసిన సింగర్ మధుప్రియ.. ఏం జరిగిందంటే ?
వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. తమ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు, బాంబు స్క్వాడ్ నిపుణులు, పోలీసు జాగిలంతో సీఎం ఇంటికి వద్దకు చేరుకున్నారు. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కానీ అనుమానించదగినట్టుగా ఎలాంటి వస్తువు లభించకపోవడంతో అది ఫేక్ కాల్ అని నిర్ధారణకు వచ్చారు. అసలు కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేసి ఉంటారనే కోణంలో విచారణ మొదలు పెట్టారు. ఈ వ్యవహారంపై తేనాంపేట పోలీసులు కేసు నమోదు చేసి, సైబర్ క్రైం పోలీసుల సహకారంతో ఆ ఫోన్ ఎక్కడ నుంచి వచ్చిందని విచారణ చేపట్టారు.
మొత్తానికి ఫోన్ చేసిన వ్యక్తి వివరాలను తెలుసుకున్నారు. ఆ వ్యక్తి.. విల్లుపురం జిల్లా మరక్కాణంకు చెందిన భువనేశ్వర్ (26)గా గుర్తించారు. వెంటనే పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు భువనేశ్వర్‌ను విచారించి అతడికి మతిస్థిమితం లేదని తెలుసుకొని, అతడి తల్లిదండ్రులను పిలిపించి, మళ్లీ అతడు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూసుకోవాలని హెచ్చరించి పంపారు. అయితే పోలీసుల విచారణలో భువనేశ్వర్‌కు ఇది కొత్తేమీ కాదని తేలింది. గతంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, పుదుచ్చేరి సీఎం, సినీనటులు రజినీకాంత్, విజయ్, అజిత్ తదితరుల ఇళ్లలో బాంబు పెట్టినట్లు ఫోన్ చేసినట్టు పోలీసుల విచారణలో తెలిసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments