జమ్ము: బస్సులో బాంబు పేలుళ్లు.. 28మందికి తీవ్రగాయాలు
- IndiaGlitz, [Thursday,March 07 2019]
పుల్వామా ఉగ్రదాడి అనంతరం బాలకోట్పై ఇండియన్ ఎయిర్ఫోర్స్ మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో సుమారు 300 నుంచి 400 ఉగ్రవాదులు చనిపోయారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదీ ఉగ్రసామ్రాజ్యంలోనే కోలుకులేని ఎదురుదెబ్బ అని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఎప్పుడెప్పుడు రివెంజ్ తీర్చుకుందామా అని ఎదురుచూస్తున్న పాక్.. ఉగ్రవాదులు చిల్లర ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. గురువారం రోజున జమ్ముకశ్మీర్లో మారణహోమం సృష్టించాలని ఉగ్రమూకలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
వివరాల్లోకెళితే.. జమ్ములోని బస్టాండ్లో నిలిపి ఉంచిన బస్సులో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో సుమారు 28మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాగా.. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్టాండ్లో రద్దీ తక్కువగా ఉండటంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న సైన్యం క్షణాల్లో ఘటనాస్థలికి చేరుకుని బస్టాండ్ పరిసరాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని తనీఖీలు చేపట్టింది. బస్సు కింద గ్రేనైడ్ (బాంబు) అమర్చడంతో ఈ పేలుడు సంభవించిందని జమ్మూ ఐజీపీ ఎంకే సిన్హా మీడియాకు వివరించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఉదయం ఎన్కౌంటర్..
ఇదిలా ఉంటే గురువారం ఉదయం కుప్వారా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాదిని సైన్యం మట్టుబెట్టింది. హంద్వారాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే నిఘా వర్గాల పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సైనికులు సోదాలు నిర్వహించి ఉగ్రవాదిని హతమార్చింది. ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ అధికారులు మీడియాకు వివరించారు.