Bomb Blast:రామేశ్వరం కేఫ్‌లో జరిగింది బాంబ్ బ్లాస్ట్.. ధృవీకరించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య..
- IndiaGlitz, [Friday,March 01 2024]
బెంగళూరు రాజాజీనగర్‌లోని రామేశ్వరం కేఫ్(Rameshwaram Cafe)లో జరిగింది బాంబ్ బ్లాస్ట్ అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధామయ్య స్పష్టం చేశారు. కేఫ్‌లో ఓ వ్యక్తి బ్యాగ్‌ను ఉంచినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించిందని తెలిపారు. కేఫ్ లోపల బ్యాగ్ ఉంచిన వ్యక్తి క్యాష్ కౌంటర్ నుంచి టోకెన్ తీసుకున్నట్లు రికార్డ్ అయిందన్నారు. దీంతో క్యాషియర్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. గాయపడిన వారిలో సిబ్బందితో పాటు ఒక కస్టమర్ కూడా ఉన్నారని.. అయితే తీవ్ర గాయాలేమి కాలేదని వెల్లడించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు.
కాగా శుక్రవారం మధ్యాహ్నం కేఫ్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో అక్కడ ఉన్నవారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుడు తీవ్రతకు రామేశ్వరం కేఫ్ లోపల దెబ్బతింది. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. కేఫ్‌లోని సిలిండర్ లేదా బాయిలర్ పేలి ఉండొచ్చని తొలుత అనుమానించారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పేలుడు వెనుక ముష్కరుల కుట్ర ఉందా..? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ కీలక ఆధారాల్ని సేకరించిందింది. సిలిండర్లు డ్యామేజ్ కాలేదని గుర్తించింది. అదే సమయంలో బోల్ట్‌లను, ఎలక్ట్రిక్ వైర్లను గుర్తించింది. దీంతో బాంబ్ పేలుడు సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఎన్‌ఐఏ టీం కూడా రంగంలోకి దిగిన దర్యాప్తును ముమ్మరం చేసింది. సీసీఫుటేజీ ఆధారంగా ఓ వ్యక్తిగా బ్యాగ్‌ను వదిలివెళ్లినట్లు గుర్తించారు. అందులోని టిఫిన్ బాక్స్ పేలుడుకు కారణమని ప్రాథమిక అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే బాంబ్ పేలుడుపై బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఓ కస్టమర్ హోటల్‌లో బ్యాగ్‌ను వదిలివెళ్లిన తర్వాత పేలుడు జరిగిందని కేఫ్ వ్యవస్ధాపకులు తనకు సమాచారం అందించారని బెంగళూర్ దక్షిణ నియోజకవర్గ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలిపారు. ఈ బాంబు బ్లాస్ట్ వెనక ఎవరూ ఉన్నారో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.
Bomb blast in #RameshwaramCafe #Bangalore caught on cctv, confirmation not #LPGCylinder pic.twitter.com/B5rtDCnsOp
— Abhishek (@abhishekbsc) March 1, 2024