కోరలు చాస్తున్న కరోనా.. బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు పాజిటివ్

  • IndiaGlitz, [Friday,January 07 2022]

దేశంలో కోవిడ్ ఓ రేంజ్‌లో విజృంభిస్తోంది. ఇవాళ కొత్త కేసుల సంఖ్య లక్ష దాటేసింది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే 13 రెట్లు పెరిగిన కేసులు ప్రభుత్వాన్ని, ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పరిస్ధితి చూస్తుంటే భారత్‌లో థర్డ్‌వేవ్ తప్పదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అటు మనదేశంలో ఒమిక్రాన్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఆ కేసులు 3007కి చేరాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 876 మంది ఒమిక్రాన్ బారినపడగా.. తర్వాత ఢిల్లీలో 465 కేసులు వున్నాయి.

కాగా.. దేశంలో పలువురు ప్రముఖులు కోవిడ్ బారినపడుతున్నారు. నిన్న ఒకేరోజు మంచు లక్ష్మీ, అరుణ్ విజయ్, సూపర్‌స్టార్ మహేశ్ బాబులకు పాజిటివ్‌గా తేలింది. తాజాగా శుక్రవారం బాలీవుడ్‌లో కోవిడ్ కలకలం రేపింది. సినీనటి స్వర భాస్కర్‌ వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయం‍గా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది.

తనకు కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలిందిని.. ప్రస్తుతం ఐసోలేషన్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాని స్వర భాస్కర్ తెలిపారు. కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలి' అని ఆమె విజ్ఞప్తి చేశారు. డబుల్‌ మాస్క్‌ ధరించి సురక్షితంగా ఉండాలని, ఇప్పటికే డబుల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నందున త్వరలోనే నెగిటివ్‌ వస్తుందని స్వర భాస్కర్ ఆకాంక్షించారు. ఇప్పటికే బాలీవుడ్‌లో కరీనా కపూర్, అమృతా అరోరా, నోరా ఫతేహి, ఏక్తా కపూర్ వంటి సెలబ్రెటీలు కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మహారాష్ట్రలో నైట్‌ కర్ఫ్యూ అమల్లోకి రాగా.. పరిస్ధితిని చూస్తుంటే అక్కడ మరోసారి లాక్‌డౌన్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.