'యాత్ర' సీక్వెల్: వైఎస్ జగన్ బయోపిక్ లో బాలీవుడ్ నటుడు ఖరారు

  • IndiaGlitz, [Friday,July 02 2021]

మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'యాత్ర' చిత్రం ఆకట్టుకుంది. ఆ చిత్రంతో వైఎస్ఆర్ అభిమానులు పూర్తిగా సంతృప్తి చెందారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా యాత్ర చిత్రం తెరకెక్కింది. 2019 ఎన్నికలపై ఆ చిత్ర ప్రభావం చాలానే ఉందనేది రాజకీయ, సినీ విశ్లేషకుల అభిప్రాయం.

యాత్ర చిత్రం విజయం సాధించడంతో సీక్వెల్ గా వైఎస్ జగన్ బయోపిక్ ని మహి వి రాఘవ్ ప్రకటించారు. జగన్ పాత్రలో సెట్ అయ్యే సరైన నటుడి కోసం రాఘవ్ వెతుకుతున్నారు. ఈ తరుణంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. జగన్ పాత్రలో నటించే నటుడిని రాఘవ్ ఫైనల్ చేశారట. ఎంతో మందిని పరిశీలించగా చివరకు బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీని ఎంపిక చేశారు.

ఇదీ చదవండి: డాక్టర్ వృత్తిని వదిలిపెట్టి నటన వైపు.. అల్లు రామలింగయ్య టూ సాయి పల్లవి

యాత్రలో వైఎస్ఆర్ పాత్రలో మలయాళీ స్టార్ మమ్ముట్టి నటించిన సంగతి తెలిసిందే. మహి వి రాఘవ్ యాత్ర సీక్వెల్ కోసం ప్రతీక్ గాంధీని కలిశారట. వైఎస్ జగన్ చరిత్రని వినిపించగా అతడు చాలా ఎగ్జైట్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించేందుకు ప్రాథమిక అంగీకారం తెలిపారట.

జగన్ రాజకీయ ప్రవేశం స్మూత్ గానే జరిగింది. కానీ వైఎస్ఆర్ మరణం తర్వాత సొంత పార్టీ స్థాపించడం, కేసుల్లో చిక్కుకోవడం, 2019 ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ఎదగడం ఇలా జగన్ బయోపిక్ లో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ఇవి తప్పకుండా పాన్ ఇండియా అంశాలు అని మహి వి రాఘవ్ నమ్ముతున్నారు.

ప్రతీక్ గాంధీలో చాలా వరకు వైఎస్ జగన్ ని పోలి ఉంటారు. ఆయన్ని ఎంపిక చేసుకోవడానికి అదొక్కటే కారణం కాదు.. జగన్ బయోపిక్ ని మహి పాన్ ఇండియా చిత్రంగా తీర్చిదిద్దబోతున్నట్లు తెలుస్తోంది. యాత్ర చిత్రాన్ని నిర్మించిన శశి దేవి రెడ్డి, విజయ్ చిల్లా జగన్ బయోపిక్ ని కూడా నిర్మిస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గాక ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలవుతుంది.