Anil Ravipudi, Balayya:అనిల్ రావిపూడి - బాలయ్య సినిమాలో విలన్‌గా బాలీవుడ్ యాక్టర్.. ఆ డైలాగ్‌తో ఎంట్రీ
- IndiaGlitz, [Wednesday,May 10 2023]
టాలీవుడ్‌ను దశాబ్ధాల పాటు ఏలుతున్న అగ్రహీరోల్లో ప్రస్తుతం చిరంజీవి, బాలకృష్ణ మాత్రమే దుమ్మురేపుతున్నారు. తిరుగులేని విజయాలతో లేటు వయసులోనూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. వీరిద్దరిలోనూ బాలయ్య మరింత దూకుడుతో వున్నారు. అఖండ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ ఏడాది వీరసింహారెడ్డితో మరోసారి హిట్ అందుకున్నారు ఎన్‌బీకే. వీటికి తోడు టాక్ షోలు, ఐపీఎల్ కామెంటేటరీ, యాడ్ అండార్స్‌మెంట్స్‌తో బాలయ్య కెరీర్‌లోనే అత్యంత పీక్స్‌లో వున్నారు. వరుసగా వంద కోట్ల కలెక్షన్స్ మార్క్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో బాలకృష్ణ తన 108వ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే మొదలైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా నడుస్తోంది.
బాలయ్యకు కృతజ్ఞతలు తెలిపిన అర్జున్ రాంపాల్ :
ఇదిలావుండగా సినిమాకు సంబంధించి బిగ్ అప్‌డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినియాలో మెయిన్ విలన్‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ నటించనున్నారు. దీనికి సంబంధించి బుధవారం చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో అనిల్ మెట్లపై కూర్చొని వుండగా.. వెనుక నుంచి అర్జున్ రామ్‌పాల్ దిగివస్తారు. ఆ వెంటనే ‘‘ఫ్లూటు జింక ముందు వూదు’’ అనే బాలయ్య డైలాగ్ చెబుతారు. దీనికి సూపర్ అంటూ అనిల్ మెచ్చుకుంటారు. ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించినందుకు అర్జున్ రాంపాల్ కృతజ్ఞతలు తెలిపారు.
బాలయ్యతో తొలిసారి జోడీకడుతోన్న కాజల్:
కాగా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ఎన్‌బీకే 108ని హరీష్ పెద్ది, సాహూ గార్లపాటి నిర్మిస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన తొలిసారిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఆయన కుమార్తెగా శ్రీలీల కనిపించనున్నారు. కాజల్‌ను తెలుగు తెరకు పరిచయం చేసింది నందమూరి కుటుంబమే. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణంతో ఆమె టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఇక జూనియర్ ఎన్టీఆర్‌తో బృందావనం, బాద్‌షా, టెంపర్ సినిమాల్లో కాజల్ నటించారు. ఇప్పుడు బాబాయ్ బాలయ్యతో కాజల్ జోడీ కడుతున్నారు. అనిత్ రావిపూడితో చిత్రం తర్వాత బోయపాటి శ్రీనుతో మరోసారి బాలకృష్ణ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఖండ 2ని సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్సులు వున్నాయి.