Corona Vaccine:కరోనా వ్యాక్సిన్‌తో రక్తం గడ్డకట్టం నిజమే.. అంగీకరించిన సంస్థ..

  • IndiaGlitz, [Tuesday,April 30 2024]

నాలుగు సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసి కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అనేక సంస్థలు వ్యాక్సిన్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యాక్సిన్లు తీసుకున్న దగ్గరి నుంచి ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. కొంతమందికి ఆకస్మిక గుండెపోటుకు గురై మరణించారు. మరికొంతమంది ఇతర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. కానీ ఈ సమస్యలపై ఏ వ్యాక్సిన్ సంస్థ ఇంతవరకు స్పందించలేదు. తాజాగా ఆస్ట్రాజెనెకా తయారుచేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ గురించి విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి.

తమ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించింది. యూకే కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో పేర్కొన్నట్టు యూకేకు చెందిన డైలీ టెలిగ్రాఫ్ న్యూస్ పేపర్ పేర్కొంది. టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్లు పడిపోవడం వంటి దుష్ప్రభావాలు తలెత్తాయని అంగీకరించినట్లు వెల్లడించింది. చాలా అరుదైన సందర్భాల్లో వచ్చే టీటీఎస్(థ్రాంబోసిస్ విత్ త్రాంబోసైటోపెనియా సిండ్రోమ్)కు ఈ వ్యాక్సిన్ కారణమవుతున్నట్టు తెలిపింది. అయితే టీకా సామర్థ్యంపై వస్తున్న వార్తలను మాత్రం ఖండించింది.

కాగా ఈ వ్యాక్సిన్ వల్ల చాలా మంది తీవ్రమైన అస్వస్థతకు గురవుతున్నారని.. వేర్వేరు వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని కేసులు రిజిస్టర్ అయ్యాయి. కొందరు కోర్టులను కూడా ఆశ్రయించారు. ఈ కంపెనీకి వ్యతిరేకంగా మొదటి కేసును జామీ స్కాట్ అనే వ్యక్తి దాఖలు చేశాడు. 44 ఏళ్ల స్కాట్‌ వ్యాక్సిన్ తీసుకున్న పది రోజులకే అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చేర్పిస్తే వ్యాక్సిన్ వల్ల వచ్చే ఇమ్యూన్‌ థ్రోంబోసైటోపెనియాగా వైద్యులు అనుమానించారు. దీని కారణంగా రక్తం గడ్డకట్టడంతో అతడి మెదడు శాశ్వతంగా దెబ్బతింది. దీంతో జరిగిన నష్టానికి ఆయనతో పాటు మరికొంతమంది 100 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 1000 కోట్లు) పరిహారం కోరుతూ యూకే హైకోర్టులో దావా వేశారు.

ఇన్నాళ్లు ఈ ఆరోపణలను ఖండిస్తూ వచ్చిన ఆస్ట్రాజెనెకా సంస్థ.. ఇటీవల కోర్టుకు సమర్పించిన నివేదికలో మాత్రం చాలా అరుదైన సందర్భాల్లో టీటీఎస్‌కి కారణమవుతుందని గ్రహించామని.. దీనికి కారణాలు మాత్రం తెలియడం లేదని స్పష్టంచేసింది. దీంతో బాధితుల ఆరోపణలు నిజమైనట్లు అక్కడి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తక్షణమే ఈ సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా కరోనా తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి బ్రిటిష్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా.. కొవిషీల్డ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఇదే వ్యాక్సిన్‌ను మన దేశంలో సీరం ఇనిస్టిట్యూట్ తయారుచేసింది. దేశంలో అత్యధిక మంది ప్రజలు తీసుకున్న టీకా ఇదే కావడం గమనార్హం. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.