రెండు రాష్ట్రాల్లో గెలిచినా.. బీజేపీకి తప్పని తిప్పలు!
- IndiaGlitz, [Thursday,October 24 2019]
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రివర్స్ అయిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల్లోనూ తిరిగి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కమలం పార్టీ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అయితే మహారాష్ట్ర వరకు కమలం వికసించింది కానీ.. హర్యానాలో మాత్రం తుస్సుమంది.
మహారాష్ట్రలో పరిస్థితి ఇదీ...
బీజేపీ : 160
కాంగ్రెస్ : 104
ఎంఐఎం : 02
ఇతరులు : 22
గెలుపు సరే సీఎం సీటు ఎవరికో!
బీజేపీ విత్ శివసేన 160 స్థానాల్లో పాగా వేసింది. అయితే కాంగ్రెస్ మాత్రం 104కే పరిమితమైంది. అయితే ఎంఐఎం రెండు స్థానాలు దక్కించుకోవడం కొసమెరుపు అనుకోవచ్చు. అయితే మిగిలిన పార్టీలన్నీ కలిసి 22 స్థానాలు దక్కించుకున్నాయి. కాగా.. బీజేపీ-శివసేన కూటమి విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రిగా ఎవర్ని కూర్చోబెట్టాలన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. పదవీ కాలన్నీ చెరిసగం పంచుకుందామని శివసేన చెబుతోంది. ఇప్పుడింకా చర్చలు జరుగుతుండటంతో పరిస్థితి ఎలా ఉంటుందో మరి. అయితే
హర్యానాలో పరిస్థితి ఇదీ..
మొత్తం స్థానాలు : 90
బీజేపీ : 40
కాంగ్రెస్ : 31
జేజేపీ : 10
ఇతరులు : 09
అయితే ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. దీంతో హంగ్ ఏర్పడింది. ఎలాగైనా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పావులు కదుపుతుండగా.. సీఎం సీటు వదులుకునే సమస్యే లేదంటూ కాంగ్రెస్ మరోవైపు జేజేపీ, ఇతర పార్టీలతో మంతనాలు జరుపుతోంది.
కౌన్ బనేగా హర్యానా సీఎం!?
హర్యానాలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చేది ఎవరనే ఆసక్తి పెరిగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకైనా తప్పనిసరిగా ఇతరుల మద్దతు కోరాల్సి ఉంది. 10 మంది ఎమ్మెల్యేలతో జేజేపీ కింగ్‌మేకర్ స్థానాన్ని ఆక్రమించింది. ఈ నేపథ్యంలో జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) చీఫ్ దుష్యంత్ చౌతాలా మాట్లాడుతూ హర్యానా మార్పు కోరుకుంటోందని, తమ పార్టీ ఆ మార్పు తీసుకొస్తుందన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం శుక్రవారం జరుగుతుందని, తదుపరి కార్యాచరణను నిర్ణయించుకుంటామని తెలిపారు. అయితే ఈయన బీజేపీ వైపే మొగ్గు చూపుతారా లేకుంటే కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతారా అన్నది శుక్రవారంతో తేలిపోనుంది.
ఏ నిమిషానికి ఏమి జరుగునో!?
మొత్తానికి చూస్తే బీజేపీ అధిష్టానం మాత్రం రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అడుగుతుందో లేకుంటే సగం సగం మంత్రి పదవులు అడుగుతుందో అని మహారాష్ట్రలో చూస్తే శివసేనతో బీజేపీకి పెద్ద తలనొప్పే మొదలైంది. అయితే ప్రస్తుతం చర్చల్లో ఉన్నారు గనుక మున్ముంథు చూడాలి. ఇక హర్యానా విషయానికొస్తే మద్దతు కూడగట్టే విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీజిబిజీగా ఉన్నాయి. ఇది కూడా బీజేపీకి తలనొప్పిగానే మారింది. అయితే ఒకవేళ హర్యానాలో బీజేపీ కాకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కర్ణాటక పరిస్థితులు రావని.. మళ్లీ ప్రభుత్వం పడిపోదని కచ్చితంగా చెప్పలేం మరి. మొత్తమ్మీద చూస్తే.. ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్లుగా పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో.. ఎవరు ఏ పార్టీలోకి జంప్ అవుతారో..? ఎవరికి మద్దతిస్తారో ఎవరు సీఎం పీఠంపై కూర్చుంటారో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు మరి.. వెయిట్ అండ్ సీ.