దుబ్బాకను సొంతం చేసుకుని.. టీఆర్ఎస్‌ను చావుదెబ్బ కొట్టిన బీజేపీ
- IndiaGlitz, [Tuesday,November 10 2020]
దుబ్బాక ఉపఎన్నిక.. ఆసక్తికరంగా మొదలైన కౌంటింగ్.. నరాలు తెగే ఉత్కంఠ.. రౌండ్ రౌండ్‌కూ మారిపోయిన ఆధిక్యాలు.. హోరాహోరీ పోరు.. మంత్రి హరీష్‌రావు ఇలాఖా.. టీఆర్ఎస్ కంచుకోట.. టీఆర్ఎస్, బీజేపీలను ఆశల పల్లకిలో ఊరేగించిన విజయం చివరకు బీజేపీ ఖాతాలో పడిపోయింది. టీఆర్ఎస్‌ను ఊహించని దెబ్బ కొట్టింది. సెంటిమెంట్ వంటివేమీ టీఆర్ఎస్‌ను కాపాడలేకపోయాయి. మొత్తం మీద బీజేపీ ఒక చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది.
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ఆది నుంచి తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి. కౌంటింగ్‌లో రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యాలు మారిపోయాయి. 23వ రౌండ్ పూర్తయ్యేనాటికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 1470 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. రఘునందన్‌కు మొత్తం 62772 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 61302 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 21819 ఓట్లు వచ్చాయి. మొత్తానికి ఓ మంచి విజయాన్ని బీజేపీ సొంతం చేసుకుంది.
తొలి ఐదు రౌండ్లు బీజేపీ ఆధిక్యాన్ని కనబరిచింది. ఆ తరువాత 6, 7 రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని కనబరిచింది. అక్కడి నుంచి 10వ రౌండ్ మినహా 11వ రౌండ్ వరకూ బీజేపీ ఆధిక్యంలో కొనసాగింది. 12వ రౌండ్ మొదలు.. 20వ రౌండ్ వరకూ టీఆర్ఎస్ ఆధిక్యాన్ని కనబరిచింది. నరాలు తెగే ఉత్కంఠ స్టార్ట్ అయిందిక్కడే. అప్పటి వరకూ కాస్తో కూస్తో లీడ్‌ను కొనసాగించిన బీజేపీ వెనుకబడిపోయి టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చేసింది. 21వ రౌండ్‌కి వచ్చేటప్పటికీ బీజేపీ తిరిగి ఆధిక్యంలోకి వచ్చేసింది. ఫైనల్ రౌండ్ 23 పూర్తయ్యే సమయానికి బీజేపీ అభ్యర్థి 1470 ఓట్లతో విజయం సాధించారు.