ఇందిరాగాంధీ-2 ఎంట్రీతో బీజేపీకి ముచ్చెమటలు!?
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొన్ని రోజులుగా దేశ రాజకీయాల్లో నెలకొన్న పరిణామాలతో కాంగ్రెస్‌కు భయం పట్టుకుందా..? ఈసారి కూడా బీజేపీని ఎదుర్కొనడం.. ప్రాంతీయ పార్టీలను మనవైపు తిప్పుకోవడం సాధ్యం కాని పనని కాంగ్రెస్.. మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్సయిందా..? యువరాజుకు పట్టాభిషేకం చేసినా ప్రయోజనమేమీ లేదని భావించిన అధిష్టానం అందరూ ఇందిరాగాంధీ-2 గా పిలుచుకునే ప్రియాంకను రంగంలోకి దించిందా..? అంటే అక్షరాలా నిజమనిపిస్తోంది. అసలు ఇన్ని రోజులు పట్టించుకోకుండా పక్కనెట్టిన ప్రియాంకను ఇంత హడావుడిగా రాజకీయాల్లోకి ఎందుకు తీసుకొచ్చారనే విషయాలు ఇప్పుడు చర్చిద్దాం.
బీజేపీకి ఊహించని షాక్..!
రాజకీయాల్లో మహిళా సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఇందుకు నిదర్శనం నాటి ఇందిరమ్మ నుంచి నేటి సుష్మ స్వరాజ్ అని చెప్పుకోవచ్చు. అందుకే గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్.. 2019 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ప్రియాంకా గాంధీని రంగంలోకి దింపింది. అసలు ప్రియాంక ఎంట్రీ ఇంత సడన్‌గా ఉంటుందని బహుశా కాంగ్రెస్ ఉద్దండులు సైతం ఊహించి ఉండరేమో.! ఒక్క మాటలో చెప్పాలంటే ఈమె ఎంట్రీనే ఓ సంచలనమని చెప్పుకోవచ్చు. కాగా ఇది కాంగ్రెస్‌కు బిగ్ డెవలప్మెంట్ అయితే.. బీజేపీకి మాత్రం ఊహించని షాక్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బుధవారం రోజున ప్రియాంకాను యూపీ తూర్పు ప్రాంతానికి జనరల్ సెక్రటరీగా నియమిస్తూ ఏఐసీసీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కాంగ్రెస్‌లో సంబరాలు మొదలయ్యాయి.. అంతే రీతిలో అధిష్టానంలో టెన్షన్ కూడా మొదలైంది!
యూపీలో చక్రం తిప్పితే సీన్ మారుతుందా..?
దేశ రాజకీయాలను శాసించాలంటే ఏ పార్టీ అయినా ఉత్తరప్రదేశ్‌లో సత్తా చాటాల్సిందే. అలాంటి ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొంతకాలంగా కాంగ్రెస్ వీక్‌గా ఉంది. గతంలో కాంగ్రెస్‌కు యూపీ కంచుకోటగా ఉండేది. అయితే క్రమంగా బీఎస్పీ, ఎస్పీ పార్టీల ప్రాబల్యం పెరగడంతో కాంగ్రెస్ తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 80 ఎంపీ స్థానాలున్న యూపీలో కేవలం 2 సీట్లకు మాత్రమే పరిమితమైందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ రెండు స్థానాల్లో సోనియా, రాహుల్ గాంధీలు మాత్రమే గెలవడం గమనార్హం. అటువంటి యూపీలో ఇప్పుడు ప్రియాంకా డైరక్ట్‌గా ఎన్నికల బరిలోకి దిగుతుంటంతో ప్రత్యర్ధి పార్టీల్లో కలవరం మొదలైందట. అయితే ప్రియాంక ఏ విధంగా ముందుకెళ్తారు..? ఎలా చక్రం తిప్పబోతున్నారు? ప్రియాంక రాకతో యూపీలో సీన్ మారుతుందా లేదా అన్నది మున్ముంథు చూడాల్సిందే.
ఇందిరాగాంధీ-2 పేరును నిలబెట్టుకుంటుందా..!?
ఇటీవలే.. కాంగ్రెస్‌తో తాము జతకట్టబోమని ఎస్పీ-బీఎస్పీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్‌కు కష్టకాలమొచ్చింది. అందుకే సరైన టైమ్‌లో ప్రియాంక రూపంలో అటు బీజేపీకి.. ఇటు ప్రాంతీయ పార్టీలను దెబ్బ కొట్టాలని భావించి రంగంలోకి దింపడం జరిగింది. కాగా.. ప్రియాంకలో నాయనమ్మ ఇందిరా గాంధీ పొలికలు అచ్చుగుద్దినట్లుగా ఉంటాయి. ఇందిరాలానే ప్రియాంక కూడా పేద వర్గాలను ఆకట్టుకునే అవకాశముందని.. ఈమెలో ప్రజలంతా ఇందిరమ్మను చూసుకుంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రియాంక రాకతో యూపీలో పార్టీ మరింత బలపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతేకాదు.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సోనియా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని.. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్బరేలీ నుంచి ప్రియాంకా బరిలోకి దింపాలని నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
రాహుల్ ఫెయిల్.. రంగంలోకి ప్రియాంక!
యూపీలో దుర్బర స్థితిలో ఉన్న కాంగ్రెస్‌కు ప్రియాంక ఎంట్రీ కలిసొస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా ఎస్పీ, బీఎస్పీ.. మరో వైపు బీజేపీలను ధీటుగా ఎదుర్కోవడంలో యువరాజు రాహుల్ ఫెయిల్ అయ్యారని భావించిన కొందరు సీనియర్లు.. అధిష్టానానికి ప్రియాంక గురించి చెప్పడం.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ప్రకటన చేయడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయని తెలుస్తోంది. దేశంలోనే అత్యధిక ఎక్కువ స్థానాలు ఉన్న యూపీలో పార్టీ బలపడి.. ఎక్కువ సీట్లు గెలవాలంటే ప్రియాంక రాకనే కరెక్ట్ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఒక్క యూపీనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రియాంకతో ప్రచారం చేయించాలనే ఆలోచన కూడా ఉంది. అయితే ఆ ప్రచారంతో ఎన్ని సీట్లొస్తాయనేది ఆ పెరుమాళ్లకే ఎరుక
మోదీ హవాను తట్టుకుంటుందా..!?
యావత్ భారత్ వ్యాప్తంగా.. ‘నమో.. మోదీ’ అనే నామస్మరణే. అయితే ఇటువంటి తరుణంలో ఎలాంటి అనుభవం లేని ప్రియాంక.. మోదీ హవాను తట్టుకుని ఆయనతో ఢీ కొంటుందా అంటే ‘ఏమో గుర్రం ఎగురవచ్చు’ అని సీనియర్ నేతలు కొందరు భావిస్తున్నారు. ముఖ్యంగా మొదట యూపీ సీఎం అయిన యోగి ఆధిత్యనాథ్‌ను ఎదుర్కోవాల్సి ఉంది. ఆ తర్వాతే మోదీ-షాను ఢీకొట్టాలి. పైగా బీజేపీలో మోదీ-షాలు ఇద్దరూ వ్యక్తులు కాదు శక్తులే.! వీళ్లను ఢీకొనాలంటే అంతకుమించి శక్తితో బరిలోకి దిగాల్సిందే లేకుంటే చిత్తు చిత్తే. అందుకే ఇప్పుడిప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన యువరాజుకు ప్రియాంక కూడా తోడైతే ఈ ఇద్దరి కాంబినేషన్‌తో ‘కాంగ్రెస్ సినిమా’ సూపర్ డూపర్ హిట్ అవుతుందని అధిష్టానం భావిస్తోంది.
మొత్తానికి చూస్తే.. ఇందిరాగాంధీ 2 ఎంట్రీ ఎలాగో అధికారికంగా జరిగిపోయింది. ప్రియాంక రాకతో మళ్లీ ఇందిరమ్మ రోజులు వస్తాయా..? లేకుంటే అసలుకే ఎసరు వస్తుందా..? మోదీపై ప్రియాంక పై ‘చేయి’ అవుతుందా..? లేకుంటే పత్తా లేకుండానే పోతుందా..? అసలు ప్రియాంక ఎంట్రీ కాంగ్రెస్‌కు కలిసొస్తుందో..? లేకుంటే బీజేపీకే కలిసొస్తుందో? అనేది తెలియాలంటే ఎన్నికల కదనరంగం పూర్తయ్యేంత వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments