ఇటు చిరు.. అటు రజినీ.. దక్షిణాదిలో సినీ ప్రముఖులే టార్గెట్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజినీకాంత్ కాషాయ తీర్థం తీసుకోబోతున్నారంటూ ఎప్పటి నుంచో ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఆయన ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త, ఆర్థిక వేత్త ఎస్.గురుమూర్తితో భేటీ కావడంతో ఆ ఊహాగానాలకు బలం చేకూరినట్టు అవుతోంది. రజినీ తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సొంత పార్టీ ఆలోచనను పక్కనబెట్టి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఎస్.గురుమూర్తితో రజినీకాంత్ భేటీ ముఖ్యంగా రాజకీయ ప్రాధాన్యంగానే జరిగిందని సమాచారం. రజినీ భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో చర్చించారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వీలైతే రజినీ బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతారు.. లేదంటే ఆ పార్టీకి తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారని ఈ భేటీతో తేలిపోయిందని స్థానికంగా చర్చ జరుగుతోంది.
కాగా.. రాజకీయాల్లో యాక్టివ్ రోల్ వద్దంటూ డాక్టర్లు తనకు సూచించారని రజినీకాంత్ చెప్పినట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో అలెర్ట్ అయిన బీజేపీ అధిష్టానం.. గురుమూర్తి ద్వారా రజినీకి ఒక ప్రతిపాదన పంపారనే టాక్ బలంగా వినబడుతోంది. వచ్చే తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా క్రియాశీలక పాత్ర పోషించాలని రజినీని గురుమూర్తి కోరినట్టు సమాచారం. ప్రస్తుతం రజినీ ఆరోగ్యం దృష్ట్యా కూడా సొంత పార్టీ పెట్టడం, అభ్యర్థుల్ని ఎంపిక చేసి వారిని బరిలోకి దింపడం ఇవన్నీ ఇప్పుడున్న పరిస్థితిలో అత్యంత కష్టమైన ప్రక్రియ. అంతేకాకుండా బీజేపీ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా రజినీ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో రజినీ బీజేపీ తరుఫున పోటీ చేసేందుకే మొగ్గు చూపుతారని తెలుస్తోంది.
దక్షిణాదిన సినీ తారలకు వల..
దక్షిణాదిన సినీ తారలకు బీజేపీ వల వేస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తమిళనాడులో కుష్బూ బీజేపీలోజాయిన్ అయిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తమిళనాడులో రజినీ, ఏపీలో చిరంజీవి రానున్న ఎన్నికల్లోగా తమ పార్టీలోకి తప్పక వస్తారన్న నమ్మకంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. మరోవైపు తెలంగాణ నుంచి విజయశాంతిని కూడా బీజేపీలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆది నుంచి బీజేపీ సినీ గ్లామర్‌కు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా దక్షిణాదిలోని తారలను తమ పార్టీలో చేర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments