ఏపీలో బీజేపీ బలోపేతానికి స్కెచ్.. సెలబ్రిటీలు.. ఆ నేతలే టార్గెట్
- IndiaGlitz, [Friday,January 15 2021]
తెలంగాణలో ఎంతో కొంత పట్టు సాధించిన బీజేపీ.. ఏపీలోనూ పట్టు సాధించేందుకు సమాయత్తమవుతోంది. ఈ క్రమంలోనే మాస్టర్ ప్లాన్స్‌తో ముందుకెళ్తోంది. చిన్నపాటి అవకాశం వచ్చినా సరే అటు అధికార పార్టీని.. ఇటు ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకుని బీజేపీ ముందుకు సాగుతోంది. అటు సెలబ్రిటీలతో పాటు.. ఇటు ఏపీలోని అన్ని ప్రాంతాల్లోనూ పేరొందిన నేతలను తమ వైపు తిప్పుకునేందుకు యత్నం సాగుతోంది. ఈ క్రమంలోనే కీలక సమావేశాలు నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సమాయత్తమవుతోంది.
సెలబ్రిటీలను పార్టీలోకి తీసుకొచ్చే యత్నం..
ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మార్చిన తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని అసంతృప్త నేతలపై ఆ పార్టీ దృష్టి సారించింది. అంతేకాకుండా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న మాజీ మంత్రులను సైతం పార్టీలో చేర్చుకుని పార్టీని బలోపేతం చేసేందుకు యత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే బీజేపీ మరోవైపు సెలబ్రిటీలపై కూడా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ప్రముఖ నటి వాణీ విశ్వనాథ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజు భేటీ అయ్యారు. అయితే ఆమె పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారా.. లేదా? అనేది మాత్రం తెలియరాలేదు. మరోవైపు గత కొంత కాలంగా ఉద్యమాలకు, రాజకీయాలకూ దూరంగా ఉంటున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను సైతం పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముద్రగడను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా బలమైన సామాజిక వర్గం అయిన కాపు ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. దీనిలో భాగంగానే సోము వీర్రాజు శనివారం ముద్రగడ నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. మరి ముద్రగడ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
కళా వెంకట్రావు.. పడాల అరుణ టార్గెట్‌గా..
టీడీపీ కీలక నేత కిమిడి కళా వెంకటరావుపై సైతం బీజేపీ కన్నేసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి అచ్చెన్నాయుడుకి అధిష్టానం కట్టబెట్టిన తర్వాత కళా అసంతృప్తితో ఉన్నారని.. పార్టీ కార్యక్రమాల్లో కాస్త దూరంగానే ఉంటూ వస్తున్నారని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కళా వెంకట్రావును తమ పార్టీలోకి తెచ్చుకుంటే తమకు కలిసొస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కళా వెంకట్రావుతో సోమువీర్రాజు భేటీ కానున్నారని తెలుస్తోంది. పార్టీలో చేరికపై చర్చించనున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర టీడీపీలో కీలక మహిళానేతగా పేరొందిన వ్యక్తి పడాల అరుణను కూడా బీజేపీలో చేర్చుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన ఆమెకు విజయనగరం జిల్లాలోని గజపతినగరంలో మంచి కేడర్ ఉంది. ఆమెను కూడా పార్టీలో చేర్చుకుని బలోపేతం చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.