ఎర్రకోటపై జెండా ఎగరేసింది బీజేపీ వ్యక్తేనట

  • IndiaGlitz, [Wednesday,January 27 2021]

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికింది! అన్నదాతలు తలపెట్టిన కిసాన్‌ పరేడ్‌ దేశ రాజధాని ఢిల్లీని రణరంగంగా మార్చింది. ఒక్కసారిగా దేశమంతా ఢిల్లీపైనే దృష్టి సారించేలా చేసింది. ఉదయం నుంచి రాత్రి వరకూ ఢిల్లీ అంతటా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడు సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో గత నవంబర్ నుంచి ఆందోళన చేస్తున్న రైతులు.. గణతంత్ర దినోత్సవాన్ని టార్గెట్ చేశారు. తమ ఆందోళన తీవ్రతను దేశంలోని నలుమూలలకు చేరవేయడంలో సక్సెస్ అయ్యారు. పోలీసు ఆంక్షలను దాటి ఎర్రకోటను వ్యూహాత్మకంగా ముట్టడించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై పోలీసులు లాఠీ ఝుళిపించి రెచ్చగొట్టారని రైతులు ఆరోపిస్తున్నారు.

తమను అడ్డుకుంటున్న పోలీసులను దాటుకుని ముందుకు వెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించారు. ఈ ప్రయత్నంలో పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసు బస్సులను తమ ట్రాక్టర్లతో ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జికి దిగడమే కాకుండా... బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ క్రమంలోనే ట్రాక్టర్‌పై నుంచి పడి ఓ రైతు మరణించాడు. పలువురు రైతులు గాయపడ్డారు. మరోవైపు పోలీసులు సైతం గాయపడ్డారు. అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆందోళనకారులు ముందుకే సాగారు. పోలీసులు అమర్చిన బారికేడ్లు, కంటెయినర్లను ఛేదించుకుని వచ్చి.. ఎర్రకోటను ముట్టడించి... దానిపై ఖల్సా జెండాను ఎగరేశారు.

అయితే ఎర్రకోటపై ఖల్సా జెండాను ఎగురవేసింది బీజేపీకి చెందిన వ్యక్తేనని తెలుస్తోంది. తొలిసారిగా ఎర్రకోటపై వేరే జెండా ఎగరడానికి కారణం అన్నదాత కాదని సమాచారం. అతని పేరు దీప్ సిద్ధూ అని తెలుస్తోంది. గతంలో దీప్ సిద్ధూ ప్రధాని మోదీతో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎర్రకోట ముట్టడికి దీప్ సిద్ధూయే సూత్రధారి అని రైతు నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనే రైతులను రెచ్చగొట్టి ఎర్రకోట వైపు తీసుకెళ్లాడని రైతు నేతలు చెబుతున్నారు. మరి ఈ ఆరోపణల వెనుక ఎంత నిజముందో.. ఆరోపణలు నిజమే అయితే దీప్ సిద్ధూ వెనుక ఎవరుండి ఇదంతా చేయించారనేది తెలియాల్సి ఉంది.