Nitin - J. P. Nadda Meet : హీరో నితిన్‌తో భేటీకానున్న జేపీ నడ్డా.. అంతుచిక్కని బీజేపీ వ్యూహం
- IndiaGlitz, [Saturday,August 27 2022]
తెలంగాణలో అధికారం అందుకోవడంతో పాటు ఏపీలోనూ బలపడాలనే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పక్కనబెట్టి ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషిస్తోంది. ఇక ఇటీవల జరిగిన పరిణామాలు బీజేపీకి మరింత జోష్ తెచ్చాయి. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడం, రాజాసింగ్ అరెస్ట్, వరుస చేరికలతో భారతీయ జనతా పార్టీ శ్రేణులు సమరోత్సాహంతో పనిచేస్తున్నాయి. అటు తెలుగు నాట రాజకీయాలను ప్రభావితం చేయగల సినీ నటులను ప్రసన్నం చేసుకోవాలని బీజేపీ ఎత్తుగడలు వేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటనకు గాను మెచ్చుకునేందుకే జూనియర్‌ను పిలిపించారని బయటకు చెబుతున్నా... రాజకీయ ఉద్దేశ్యాలు వేరే వున్నాయని విశ్లేషకులు అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ - అమిత్ షా భేటీతో తెలుగునాట ప్రకంపనలు చోటు చేసుకున్నాయన్నది మాత్రం వాస్తవం.
నితిన్‌తో సహా పలువురు ప్రముఖులతో భేటీకానున్న నడ్డా:
ఇదిలావుండగా మరో యంగ్ హీరో నితిన్ ఇప్పుడు బీజేపీ నేతల కంట్లో పడ్డాడు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో నితిన్ ఈరోజు భేటీకానున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ శనివారం సాయంత్రం హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేపీ నడ్డా వస్తున్నారు. ఇక్కడ బహిరంగ సభ ముగిసిన అనంతరం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు నడ్డా. ఈ సందర్భంగా శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో నితిన్‌తో ఆయన భేటీకానున్నారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులు, క్రీడాకారులు కూడా నడ్డాతో సమావేశమవుతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వీటన్నింటిలోకి నితిన్‌తో భేటీని ప్రజలు, రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
తెలుగు హీరోలను స్టార్ క్యాంపెయినర్లుగా వినియోగించుకుంటారా :
నిన్న జూనియర్ ఎన్టీఆర్, నేడు నితిన్‌లతో బీజేపీ అగ్రనేతలు భేటీ అవ్వడం వెనుక కమలనాథుల ఎన్నికల వ్యూహం వుండొచ్చనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వచ్చే తెలంగాణ, ఏపీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో వుంచుకుని టాలీవుడ్ హీరోలను స్టార్ క్యాంపెయినర్లుగా వాడుకునే ఆలోచనే బీజేపీ వుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.