దర్శకధీరుడికి పొలిటికల్‌ హీట్‌

వివాదాలకు దూరంగా ఉండే దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు పొలిటికల్‌ సెగ తగిలింది. ఈ సమస్యకు కారణం ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆర్‌ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)' చిత్రమే. అసలు సినిమాకు రాజకీయాలకు కారణమేంటనే వివరాల్లోకెళ్తే.. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. వీరిలో మన్యం వీరుడిగా రామ్‌చరణ్‌ నటిస్తుండగా, గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. కొమురం భీమ్‌ వర్ధంతి సందర్భంగా అక్టోబర్‌ 22న ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌లో కొమురం భీమ్‌ పాత్రధారి చివరల్లో ముస్లిం వేషధారిగా కనిపిస్తారు. నైజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కొమురం భీమ్‌ను ముస్లింగా చూపడమేంటి? జక్కన్న చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి. ఆదీవాసీలు కూడా రాజమౌళికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సోయం బాపూ రావు రాజమౌళికి వార్నింగ్‌ ఇచ్చారు. ట్రిపులార్‌ సినిమాలో భీమ్‌ పాత్ర ధరించిన టకియా(ముస్లింలు ధరించే టోపీ) సన్నివేశాన్ని తొలగించాలన్నారు బాపూరావు. అలాకాదని సినిమాను విడుదల చేస్తే థియేటర్స్‌ను తగలబెట్టే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. సినిమా కోసం తమ ఆరాధ్య దైవాన్ని కించపరిస్తే ఒప్పుకోమని, భీమ్‌ను చంపినవాళ్ల టోపీ ఆయనకు పెట్టడం ఆదీవాసులను అవమానించడమేనని, చరిత్ర తెలుసుకుంటే మంచిదని లేకుంటే మర్యాద ఉండదని బాపూరావు ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరి ఈ విషయంపై రాజమౌళి అండ్‌ టీం ఎలా స్పందిస్తారో చూడాలి.