Raghunandan Rao:4 వేల కోట్ల ల్యాండ్ స్కాంలో తోట చంద్రశేఖర్.. భూ దందా కోసమే బీఆర్ఎస్లోకి : రఘునందన్ రావు వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల బీఆర్ఎస్లో చేరిన జనసేన నేత తోట చంద్రశేఖర్‌ను ఉద్దేశించి బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తోట చంద్రశేఖర్‌కు సీఎం కేసీఆర్ రూ.4 వేల కోట్ల విలువైన భూములను కట్టబెట్టారని ఆరోపించారు. తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలోనే భూ కుంభకోణం జరిగిందని.. ఇందులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పాత్ర కూడా వుందని రఘునందన్ అన్నారు. దీనిలో భాగంగా మియాపూర్‌లోని 40 ఎకరాల భూమిని చంద్రశేఖర్‌కు కట్టబెడుతున్నారని..ముందు జరిగిన ఒప్పందంలో భాగంగానే ఖమ్మం బీఆర్ఎస్ సభకు ఆయన ఖర్చు పెడుతున్నారని రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్‌కు బీహారీలంటే చాలా ఇష్టం :
కేసీఆర్‌కు గతంలో దొంగలుగా, రాక్షసులుగా కనిపించిన ఆంధ్రా వాళ్లు ఇప్పుడు బంధువులుగా, మిత్రులుగా మారిపోయారని ఆయన దుయ్యబట్టారు. మియాపూర్ భూములకు సంబంధించి గతంలో సుఖేష్ గుప్తా వ్యవహారంలో కోర్ట్‌ను ఆశ్రయించిన రంగారెడ్డి కలెక్టర్ ఇప్పుడు.. తోట చంద్రశేఖర్ విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. బీహార్ అధికారులంటే కేసీఆర్‌కు ప్రేమ ఎక్కువని.. దీనిలో భాగంగానే బీహార్‌కు చెందిన అధికారిని డీజీపీని నియమించారని ఎద్దేవా చేశారు.
ఇటీవలే బీఆర్ఎస్లో చేరిన తోట చంద్రశేఖర్:
ఇకపోతే.. గతంలో ఐఏఎస్ అధికారిగా పనిచేసిన తోట చంద్రశేఖర్ అనంతరం చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం, వైసీపీలో పనిచేసి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఆ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ జనసేన కీలక నేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్లో చేరారు తోట చంద్రశేఖర్. ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఆయనను ప్రకటించారు కేసీఆర్. తోట వెంట మాజీ మంత్రులు రావెల కిశోర్ బాబు, రామలింగేశ్వరరావు, విశాఖకు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి సైతం బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout