Jana Sena:జనసేనకు ఆ స్థానాలు కేటాయింపు వెనక బీజేపీ మాస్టర్ ప్లాన్..!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో గెలుపుకోసం బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. అందుకోసం జనసేన పార్టీతో పొత్తుకు సిద్ధమైంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో రెండు సార్లు భేటీ అయి సీట్లుపై చర్చించారు. ఎట్టకేలకు సీట్ల లెక్క ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. 11 సీట్లు కావాలని జనసేన పట్టుబడగా.. పలు దఫాల చర్చల తర్వాత 9 స్థానాలకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లితో పాటు మరో ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీకి రెడీ అయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, అశ్వారావుపేట, కొత్తగూడెం, మధిర, వైరా, నాగర్‌కర్నూల్, కోదాడ స్థానాలు జనసేనకు కేటాయించారని చెబుతున్నారు. అయితే తాండూరు, శేరిలింగంపల్లి స్థానాల కోసం జనసేన పట్టుబడుతుండగా.. ఆ రెండు స్థానాలు తమకు వదిలేయాలని బీజేపీ కోరుతుంది.
జనసేనకు కేటాయించిన సీట్లను పరిశీలిస్తే అక్కడ ఎక్కువగా టీడీపీ మద్దతుదారుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఏపీలో టీడీపీతో జనసేన పొత్తులో ఉంది కాబట్టి.. ఇక్కడ కూడా తెలుగు తమ్ముళ్లూ తమ పార్టీకి ఓటేస్తారని జనసేన భావిస్తోంది. తెలంగాణ వచ్చాక తెలుగుదేశం పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోయినా.. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఈసారి టీడీపీ పోటీకి దూరం కావడంతో ఆ ఓటు బ్యాంక్ తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ, జనసేన ప్రయత్నిస్తున్నాయి. అందుకే తెలుగుదేశం సానుభూతిపరులు ఎక్కువగా ఉన్న సీట్లను జనసేనకు కేటాయించారనే ప్రచారం జరుగుతోంది.
2018 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటును బీజేపీ గెలుచుకుంది. తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్ రావు, హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ విజయం సాధించారు. దీంతో బీజేపీ బలం మూడుకు చేరుకుంది. కానీ ఈసారి మాత్రం అత్యధిక స్థానాలు గెలిచేలా కమలం పెద్దలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న హోరాహోరి పోటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని కాషాయం నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేనతో కలిసి మెజార్టీ స్థానాలు నెగ్గితే కింగ్ మేకర్ కావొచ్చని ప్లానింగ్‌లో ఉన్నారు.
నామినేషన్లకు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండగా.. 88 చోట్ల మాత్రమే అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మిగిలిన 31 స్థానాల్లో 9 స్థానాలు జనసేనకు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇక 22 స్థానాలకు అభ్యర్థులను రెండు రోజుల్లో ప్రకటించనుంది. మరోవైపు ప్రధాని మోదీ రేపు(మంగళవారం) తెలంగాణ పర్యటనకు రానున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పాల్గొనే బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు తాను కూడా హాజరువుతానని పవన్‌కల్యాణ్ ప్రకటించారు. మోదీ పర్యటన తర్వాత పొత్తులో భాగంగా జనసేన ఎన్ని చోట్లు పోటీ చేయనుందో క్లారిటీ రానుంది. మొత్తానికి కూటమి అభ్యర్థుల విజయం కోసం రెండు పార్టీలు కలిసి పనిచేయనున్నాయి. మరి ఈ పొత్తు ఎంతవరకు కలిసివస్తుందో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com