‘ఆకుల’ ప్రకటనతో ఏపీ బీజేపీలో ఆల్ హ్యాపీస్..!
- IndiaGlitz, [Monday,January 07 2019]
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే(బీజేపీ) ఆకుల సత్యనారాయణ రాజీనామా చేసినట్లు సోమవారం నాడు పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పుకార్లు వచ్చిన సమయంలో ఆకుల ఢిల్లీలోనే ఉండటంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు రాజీనామా లేఖను అందజేశారనే వార్తతో ఏపీ బీజేపీ నేతలు ఒకింత కంగుతిన్నారు. నిన్నటి వరకూ అంతా బాగానే ఉన్న ఆయన ఎందుకిలా చేశారో తెలియక ఆకుల అనుచరులు, బీజేపీ కార్యకర్తలు సైతం తలలు పట్టున్నారు. అయితే ఈ పుకార్లు రేగిన కొన్ని గంటలకే ఆయన రియాక్టయ్యి రాజీనామా వార్తలను తీవ్రంగా ఖండించడంతో ఏపీ బీజేపీలో ఆనందంలో మునిగి తేలుతున్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను కేంద్రంలోని పెద్దలతో చర్చించడానికి మాత్రమే తానొచ్చానని స్పష్టం చేశారు. అంతేకాదు తానింకా అమిత్ షాను కలవనే లేదని చెప్పుకొచ్చారు.
ఆకులపై అసలెందుకీ పుకార్లొచ్చాయ్..!
అధికార పార్టీ నేతల విమర్శలకు దీటుగా బదులిచ్చే నేతల్లో ముందుండే నేత ఆకుల సత్యనారాయణ. అసెంబ్లీలో అయినా.. బయట అయినా.. సీఎం చంద్రబాబుకు మొదలుకుని ఎమ్మెల్యే, ఎంపీల వ్యాఖ్యలకు బీజేపీ తరఫున గట్టిగా కౌంటరిస్తుండేవారు. అయితే ఇలాంటి వ్యక్తి ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నిక నుంచి కాసింత అసంతృప్తితో ఉన్నారన్నది జగమెరిగిన సత్యం. మరీ ముఖ్యంగా ఈ మధ్య బీజేపీ చేపట్టే కార్యక్రమాల్లో పెద్దగా కనిపించకపోవడంతో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీ మారాలనే యోచనలో ఉన్నారని సమాచారం.
చివరికి జనసేన గూటికేనా..!?
అయితే ఇప్పటికే ఆయన భార్య లక్ష్మీ పద్మావతి జనసేన కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. దీంతో ఆకుల కూడా జనసేనలో చేరతారని వార్తలు వినిపించాయి. ఈ వ్యవహారం కంటే ముందే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఆకుల రహస్యంగా భేటీ అయ్యారని ఒక ఎంపీ, ఎమ్మెల్యే టికెట్‌పై స్పష్టమైన హామీ వచ్చిందని టాక్. ఈ నేపథ్యంలోనే ఇవాళ కాకపోయినా అతి త్వరలోనే ఆకుల బీజేపీ బై..బై చెప్పేసి బయటికొచ్చి పవన్ ఆధ్వర్యంలో జనసేన కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. అయితే ఇది ఎంత వరకు నిజమవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.