BJP Janasena:తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ-జనసేన..!

  • IndiaGlitz, [Wednesday,October 18 2023]

తెలంగాణ ఎన్నికల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో(assembly elections) ఉమ్మడిగా బరిలోకి దిగాలని బీజేపీ-జనసేన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇవాళ ఉదయం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan)తో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy), ఎంపీ లక్ష్మణ్(Lakshman) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరు పొత్తులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని జనసేనానితో కిషన్‌రెడ్డి చర్చించారు. దీనికి పవన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పొత్తులపై మరో రెండు మూడు రోజుల్లో తుది నిర్ణయం వెల్లడికానుందని పేర్కొంటున్నారు. మరోవైపు అభ్యర్థుల ఎంపికపై కాసేపట్లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది.

ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే..

అంతకుముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులతో సమావేశమయ్యారు. తెలంగాణ శాసన సభ ఎన్నికలలో జనసేన పోటీ చేయాల్సిందేనని వారు సేనానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సన్నద్ధతపై , పోటీ చేయదలచుకున్న అభ్యర్థుల అభిప్రాయాలను పవన్ తెలుసుకున్నారు. అయితే 2018లో కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదన్న ఉద్దేశంతో పోటీ చేయరాదనే సూచన మేరకు తాము దూరంగా ఉన్నామని నేతలు వెల్లడించారు. ఆ తర్వాత మిత్రపక్షమైన బీజేపీ విజ్ఞప్తి మేరకు జీహెచ్‌ఎంసీ(GHMC) ఎన్నికల బరి నుంచి తప్పుకున్నామని తెలిపారు. కానీ ఈసారి మాత్రం తప్పనిసరిగా పోటీ చేయాల్సిందేనని వారు ముక్తకంఠంతో అధినేతను కోరారు. ఈ దఫా పోటీ చేయకపోతే తెలంగాణాలో పార్టీ ఎదుగుదలను చేతులారా ఆపుకున్నట్లేనని పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల ముందుకు భవిషత్తులో బలంగా వెళ్లడం కష్టమేనని, క్యాడర్ నిరుత్సాహానికి గురవుతారని స్పష్టం చేశారు.

టీడీపీతోనూ కలిసి వెళ్లే యోచనలో బీజేపీ..

అనంతరం పవన్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తానూ అర్ధం చేసుకోగలనన్నారు. తన మీద ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని అయితే నాయకులు, జన సైనికులు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానని పవన్ వెల్లడించారు. సరైన నిర్ణయం తీసుకోడానికి ఒకటి రెండు రోజుల సమయం అవసరమని పేర్కొన్నారు. తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పవన్ కల్యాణ్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు టీడీపీ(TDP)తో కలిసి వెళ్లాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కూటమిగా పోటీ చేస్తే ఒకవేళ హంగ్ వస్తే కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని కమలం పెద్దలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.