ఇలాగైతే బీజేపీ బలపడటం కాదు కదా.. కనుమరుగే!
Send us your feedback to audioarticles@vaarta.com
అసలే మూలిగే నక్క.. దానిపై తాటికాయ పడితే ఎలా ఉంటుంది? అలా ఉంది ఏపీలో బీజేపీ పరిస్థితి. తెలంగాణ విడిపోయిన అనంతరం ప్రత్యేక హోదా ఇస్తామని కొంతకాలం.. ఆపై హోదా కాదు.. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని కొంతకాలం ఏపీ ప్రజానీకాన్ని మోదీ సర్కార్ మభ్యపెడుతూ వచ్చింది. చివరకూ హోదా లేదు ప్యాకేజి లేదు దీంతో ఏపీ ప్రజానీకానికి బీజేపీ అంటేనే విరక్తి వచ్చింది. ఒకరకంగా అసహ్యించుకునే పరిస్థితి వచ్చింది. ఏదో అలాగే నడిచినా ఎంతో కొంత బాగుండేదేమో కానీ ఏపీకి తలమానికమైన.. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తారన్న వార్త మాత్రం ఏపీలో బీజేపీ పతనానికే కారణమవుతోందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. బీజేపీ అధిష్టానం తీసుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటు పరం నిర్ణయంతో స్థానిక నేతలు డిఫెన్స్‌లో పడిపోయారు.
ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి..
బీజేపీ షాకుల మీద షాకులిస్తుంటే స్థానిక నేతలకు మైండ్ బ్లాంక్ అవుతోంది. ప్రత్యేక హోదా నుంచి సీమ నిధుల దాకా.. రైల్వే జోన్ నుంచి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వరకు కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి అశనిపాతంగా మారాయి. అధినాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో బీజేపీ ఏపీ నేతలు ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి. ఈ క్రమంలో రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఒక్క శాతం కూడా ఓట్లను బీజేపీ సాధించలేకపోయింది. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూట గట్టుకుంది. ఇప్పటికే ఏపీ నుంచి లోక్‌సభలో గానీ, అసెంబ్లీలో గానీ ప్రాతినిధ్యం వహించే వారు లేకపోవడం దుస్థితికి అద్దం పడుతోంది. ఇక మున్ముందు ఏపీలో బీజేపీ సోదిలో కూడా లేకుండా పోతుందనడంలో సందేహం లేదనేది రాజకీయ నిపుణులు చెబుతున్న మాట.
ఏమాత్రం క్రెడిట్ దక్కలేదు..
రాష్ట్రాన్ని నిట్ట నిలువునా చీల్చిన కాంగ్రెస్ కంటే.. బీజేపీయే ఎక్కువగా వెన్నుపోటు పొడిచిందని ఏపీ ప్రజలు నమ్ముతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిని మార్చినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. అంతర్వేది రథం దహనం నుంచి రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తలనరికిన ఘటన వరకూ దేవాలయాల దాడుల అంశాలన్నీ హైలైట్ చేస్తూ ఆందోళన చేసినప్పటికీ బీజేపీకైతే ఏమాత్రం క్రెడిట్ దక్కలేదు. అసలు ఏపీ ప్రజానీకం బీజేపీని నమ్మే పరిస్థితే లేదు. అలాంటి సమయంలో విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వార్త.. బడ్జెట్లో ఏపీకి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ప్రజలు బీజేపీ అంటేనే అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజల నుంచి వచ్చే నిరసనలు భరించలేక బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కాకర నూకర రాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఏపీలో బీజేపీ బలపడటం మాట దేవుడెరుగు.. పూర్తిగా కనుమరుగవడం ఖాయమని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com